తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్‌13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి

సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు.

Updated : 17 May 2024 08:03 IST

సీసీఎంబీ పరిశోధనలో గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. పురుషుల్లో సంతానలేమిపై ఈ సంస్థ తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలను గుర్తించారు. పురుషుల్లో వీర్య కణ అభివృద్ధికి ఎక్స్‌ క్రోమోజోమ్‌ జన్యువు(టీఈఎక్స్‌13బి) అవసరమని మొదటిసారిగా సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. తల్లి నుంచే ఇది సంక్రమిస్తుందని పేర్కొన్నారు. వేర్వేరు సంస్థలతో కలిసి సీసీఎంబీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్‌, డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌, డాక్టర్‌ స్వస్తిరాయ్‌ చౌధురి చేసిన పరిశోధన వివరాలు తాజాగా ‘హ్యూమన్‌ రీప్రొడక్షన్‌ జర్నల్‌’లో ప్రచురితమయ్యాయి. ఆ వివరాలు.. 

  • శాస్త్రవేత్తల బృందం నెక్స్ట్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌ ఉపయోగించి సంతానం ఉన్న, సంతానలేమితో బాధపడుతున్న పురుషుల జన్యు కోడింగ్‌ రీజియన్లను విశ్లేషించింది. టీఈఎక్స్‌13బి జన్యువులోని రెండు కారణ ఉత్పరివర్తనాలను కనుగొని ఈ మేరకు ఫలితాలు రాబట్టినట్లు పీహెచ్‌డీ విద్యార్థి, యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌ పోస్ట్‌డాక్టొరల్‌ రీసెర్చర్‌ డాక్టర్‌ ఉమేశ్‌కుమార్‌ తెలిపారు.
  • పరిశోధకులు ఎలుకల్లో స్పెర్మ్‌ ఉత్పత్తి కణాల సెల్‌ కల్చర్‌ మోడల్‌ను అభివృద్ధి చేశారు. క్రిస్పర్‌ కాస్‌9 సాంకేతికత ఉపయోగించి టీఈఎక్స్‌13బి జన్యువును తొలగించి చూశారు. అప్పుడు స్పెర్మ్‌ కణాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గినట్లు గుర్తించారు.
  • స్పెర్మ్‌ ఉత్పత్తి కణాల్లో జీవక్రియను టీఈఎక్స్‌13బి ప్రభావితం చేస్తుందని నిర్ధారణకు వచ్చారు. స్పెర్మాటోజెనిక్‌ కారణంగా సంతానలేమితో బాధపడుతున్న మగవారిని పరీక్షించడానికి ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగపడతాయని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ కుమార్‌ నందికూరి తెలిపారు. ‘టీఈఎక్స్‌13బి జన్యువు ఎక్స్‌ క్రోమోజోమ్‌లో ఉంటుంది. తల్లుల నుంచి మగవారు దీన్ని పొందుతారు. ఒకవేళ తల్లి లోపభూయిష్ట ‘టీఈఎక్స్‌13బి’ని కలిగి ఉంటే అది వారి మగ సంతానానికి సంక్రమిస్తుంది. ఆమె తనయుడు వంధ్యత్వానికి గురవుతాడు’ అని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్‌ తంగరాజ్‌ అన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని