కొత్తగా 203 పంచాయతీల్లో బడులు

రాష్ట్రంలో కొత్తగా 203 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 18 May 2024 03:48 IST

జూన్‌ 12న ప్రారంభించేందుకు కసరత్తు
మరో 62 గ్రామ పంచాయతీల్లో పిల్లలు లేరంటున్న విద్యాశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 203 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీకి కనీసం ఒక ప్రభుత్వ పాఠశాల తప్పనిసరని, దానిపై నివేదిక సమర్పించాలని గత జనవరిలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకే 257 పంచాయతీల్లో పాఠశాలలు లేవని డీఈఓలు ప్రాథమిక నివేదిక అందజేశారు. వాటిల్లో 122 చోట్లే అవి అవసరమని పేర్కొన్నారు. దానిపై మరోసారి క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఇటీవల తాజా పరిస్థితుల ఆధారంగా వివరాలను అందజేశారు. గతంలో 122 అవసరమన్న అధికారులు.. ఇప్పుడు 203 చోట్ల బడులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. జూన్‌ 12న కొత్త విద్యా సంవత్సరం(2024-25) ప్రారంభం కానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాల విద్యాశాఖ అధికారులు కొత్త పాఠశాలల ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టారు. అవసరమైన మౌలిక వసతులపై దృష్టిసారించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆవాసానికి కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల ఉండాలి. గతంలో దాదాపు అన్ని పంచాయతీల్లో కనీసం ఒక బడి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా మార్చినందున కొన్ని చోట్ల బడులు లేని పరిస్థితి తలెత్తింది.

నల్గొండలో అత్యధికంగా 24 అవసరం

రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో 265 చోట్ల పాఠశాలలు లేవని తేల్చారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా 62 చోట్ల పాఠశాలలు లేకున్నా.. అక్కడ బడికి వెళ్లే వయసు పిల్లలు లేరని విద్యాశాఖ వర్గాలు సర్కారుకు నివేదిక సమర్పించాయి. అంటే 203 చోట్ల కొత్తగా 1-5 తరగతులకు ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించనున్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 24, ఆ తర్వాత యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌ జిల్లాల్లో 21 చోట్ల పాఠశాలలను నెలకొల్పుతారు. గద్వాల, ఆసిఫాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో పాఠశాలలు అవసరం లేదని తేల్చారు. అంటే మొత్తం 29 జిల్లాల్లో కొత్త బడులు రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి తాత్కాలికంగా అద్దె భవనాల్లో బడుల్ని ప్రారంభిస్తారు. అక్కడ విద్యా వాలంటీర్లను నియమిస్తారు. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి రాగానే నోటిఫికేషన్‌ జారీ చేసి వారిని నియమించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని