కుంగిన బ్లాక్‌లో ఒక గేటును పైకెత్తిన ఇంజినీర్లు

ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్‌ గేట్లున్నాయి.

Published : 18 May 2024 03:52 IST

మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్‌లోని 15వ గేటును శుక్రవారం పైకెత్తారు.. 

ఈనాడు హైదరాబాద్‌: ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్‌ గేట్లున్నాయి. గత అక్టోబరులో బ్యారేజీ కుంగినప్పుడు 77 మాత్రమే ఎత్తి నీటిని కిందికి వదిలారు. కుంగిన ఏడో బ్లాక్‌లో 15 నుంచి 22వ గేటు వరకు ఎత్తలేదు. పియర్స్‌ కుంగడం, బీటలు వారడంతో గేట్లు ఎత్తితే సమస్యలు వస్తాయని భావించారు. ఇటీవల నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) ఇచ్చిన మధ్యంతర నివేదికలో 20, 21వ గేట్లను పూర్తిగా తొలగించాలని సూచించింది. మిగిలిన ఆరుగేట్లను పైకెత్తాలని, ఏదైనా గేటు ఎత్తేటప్పుడు సమస్య వస్తే దానిని కూడా తొలగించాలని పేర్కొంది. దీనికి అనుగుణంగా నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌టీతో భాగస్వామ్యం ఉన్న పి.ఇ.ఎస్‌ సంస్థతో మాట్లాడి మొదట ఒక గేటును పైకి లేపినట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. కుంగిన ప్రభావం తక్కువగా ఉన్న 15వ గేటును పైకి ఎత్తారు. క్రమంగా మిగిలిన గేట్ల విషయంలో ఎన్డీఎస్‌ఏ సూచన మేరకు చర్యలు తీసుకొంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని