సంక్షిప్త వార్తలు (9)

తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్‌ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్‌ ఆఫ్‌ ది సాయిల్‌) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు.

Updated : 18 May 2024 05:11 IST

భూమిపుత్రుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్‌

తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్‌ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్‌ ఆఫ్‌ ది సాయిల్‌) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, గాదరి బాలమల్లు, పుస్తక రచయిత శ్రీనివాసయాదవ్, తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు, హైదరాబాద్‌


డబుల్‌ ఓట్లను గుర్తించి తొలగించాలి
ఈసీకి జి.నిరంజన్‌ లేఖ

హైదరాబాద్, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఓట్లేసిన వారికి హైదరాబాద్‌లో కూడా ఓటు ఉన్నట్లైతే ఆ ఓటును తొలగించాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు శుక్రవారం లేఖ రాశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికలు ఉన్నందున రెండు చోట్ల ఓట్లు ఉన్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఈసీని లేఖలో కోరారు.


గనుల శాఖ కార్యదర్శి మహేశ్‌దత్‌ ఎక్కా బదిలీ

ఈనాడు, హైదరాబాద్‌: గనుల శాఖ కార్యదర్శి మహేశ్‌దత్‌ ఎక్కాను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అదే విధంగా తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) వీసీ, ఎండీగా ఆయన అదనపు బాధ్యతలు వహిస్తుండగా వాటి నుంచి కూడా ఆయన్ను రిలీవ్‌ చేసింది. మహేశ్‌దత్‌ ఎక్కా స్థానంలో పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న ఐఏఎస్‌ అధికారి కె.సురేంద్రమోహన్‌ను గనుల శాఖ కార్యదర్శిగా నియమించింది. అదేవిధంగా సురేంద్రమోహన్‌కు టీఎస్‌ఎండీసీ వీసీ, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సురేంద్రమోహన్‌ గతంలో గవర్నర్‌ కార్యదర్శిగా పనిచేశారు. ఎక్కాను జీఏడీలో రిపోర్టు చేయాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. 


పీఆర్‌సీ ఛైర్మన్‌కు ఉద్యోగుల ప్రతిపాదనలు

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: తెలంగాణ ఉద్యోగుల సంఘం సెంట్రల్‌ అసోసియేషన్‌  పీఆర్‌సీ ఛైర్మన్‌ ఎన్‌.శివశంకర్‌ను కలిసి తమ ప్రతిపాదనలు సమర్పించింది. శుక్రవారం బీఆర్‌కే భవన్‌లో పీఆర్‌సీ ఛైర్మన్‌ను కలిసిన సంఘం ప్రతినిధులు 40 శాతం ఫిట్‌మెంట్, వంద శాతం రుణాల (అడ్వాన్సు) పెంపు, లీవ్‌ ట్రావెల్‌ అలవెన్స్‌ మంజూరు, హెల్త్‌ కార్డులు, పెన్షన్‌ స్ట్రక్చర్, అదనపు పెన్షన్, పాత పెన్షన్‌ అమలు, ఆర్జిత సెలవుల జమపై ఉన్న పరిమితి ఎత్తివేయడం తదితర అంశాలపై చర్చించారు. తమ ప్రతిపాదనలకు ఛైర్మన్‌ సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఛైర్మన్‌ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మఠం రవీంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి సి.హరీశ్‌ కుమార్‌రెడ్డి, గౌరవ ఛైర్మన్‌ ఎ.పద్మాచారి, ఉపాధ్యక్షుడు జి.జాకబ్‌ తదితరులు ఉన్నారు. 


ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలను పరిష్కరించండి: టీఈఏ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసినందున శనివారం జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించి పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం(టీఈఏ) రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్‌ జి.నిర్మల్‌ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, పీఆర్‌సీ నుంచి నివేదిక తెప్పించుకొని కొత్త పీఆర్‌సీని 40 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రకటించాలని, 317 జీవోను రద్దు చేసి స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి రప్పించాలని, రాష్ట్ర ఉద్యోగులకు రావాల్సిన నాలుగు పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని ఆమె కోరారు. 


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పలువురు సినీ దర్శకులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్‌డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. దర్శకులు హరీశ్‌శంకర్, అనిల్‌ రావిపూడి, వీరశంకర్‌ తదితరులు సీఎంను కలిశారు. వీరివెంట కాంగ్రెస్‌ నేత రోహిణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 


ఎస్సెల్బీసీ పనుల్లో వేగం పెంచండి: రాహుల్‌ బొజ్జా

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమగట్టు సొరంగం (ఎస్సెల్బీసీ) పనుల్లో వేగం పెంచాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఈ పనులపై సమీక్ష నిర్వహించారు. సొరంగంలో సీపేజీ ఏర్పడటంతో నిలిచిపోయిన పనులను ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ పనులు పూర్తైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అనేక ప్రాంతాలకు తాగు, సాగునీరు అందనుంది.


మరో రెండేళ్లు ఎఫ్‌ఎంజీల ఇంటర్న్‌షిప్‌ గడువు పొడిగింపు 

ఈనాడు, హైదరాబాద్‌: ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ (ఎఫ్‌ఎంజీ)లు ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు మరో రెండేళ్లు గడువు పొడిగిస్తూ జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలతో గడువు ముగుస్తుండటంతో దానిని 2026 మే వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మెడికల్‌ కౌన్సిళ్లు, ఎఫ్‌ఎంజీల విజ్ఞప్తిమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.


బౌద్ధ పర్యాటకుల్ని రప్పించేలా ప్రణాళిక
ఏబీటీవో ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రముఖ బౌద్ధ పర్యాటక స్థలాలతోపాటు బుద్ధవనాన్ని ఆసియా దేశాలకు పరిచయం చేసి, అధిక సంఖ్యలో బౌద్ధ పర్యాటకులను రాష్ట్రానికి రప్పించడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఏబీటీవో ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. భూటాన్‌లోని థింపూలో శుక్రవారం జరిగిన ‘ఆసియా రహదారిపై బౌద్ధ పర్యాటకం’ సదస్సులో ఆయన మాట్లాడారు. ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి పర్యాటక రంగం సాంస్కృతిక సారథిగా వ్యవహరించాలన్నారు. అంతర్జాతీయ సంతోష యాత్ర (ఇంటర్నేషనల్‌ హ్యాపీనెస్‌ మార్చ్‌)ను నిర్వహించడానికి భూటాన్‌ బౌద్ధ సంస్థల ప్రతినిధులతో సన్నాహక చర్యలను ప్రారంభించినట్లు లక్ష్మయ్య చెప్పారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని