అధిక ధరకు...బియ్యం టెండర్లు!

సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్‌ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు.

Published : 18 May 2024 04:33 IST

నాలుగు సంస్థలదీ దాదాపు ఒకే ధర
కిలోకు రూ.56.80-57.00 చొప్పున ప్రతిపాదన
మార్కెట్‌లో రూ.45 - 50 మాత్రమే
2.20 లక్షల టన్నుల బియ్యం కొనుగోలుకు బిడ్లు

ఈనాడు, హైదరాబాద్‌: సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్‌ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు. జూన్‌ మొదటి వారం వరకు కోడ్‌ అమలులో ఉండనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ నుంచి అధికారులు ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు. జిల్లాల వారీగా పిలిచిన టెండర్లలో నాలుగింటిలో ఎల్‌-1గా నిలిచిన సంస్థలను పౌరసరఫరాలశాఖ గుర్తించింది. ఈ నాలుగు టెండర్లలో ఎల్‌-1 గా నిలిచిన సంస్థలు దాదాపు ఒకే ధరను కోట్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 

ఈ-టెండర్‌ విధానంలో కొనుగోలు

మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎస్, హాస్టళ్లకు పౌరసరఫరాలశాఖ బియ్యం సరఫరా చేస్తుంది. రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా సన్న ధాన్యాన్ని సేకరించి... మిల్లింగ్‌ చేయించి బియ్యాన్ని సరఫరా చేస్తుంది. అయితే గత ఏడాది సన్న ధాన్యం తక్కువగా సేకరించడంతో, అవసరమైన బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. మార్చి తొలివారం ఆఖరులో ఈ-టెండర్లు పిలిచింది. ప్రతి నెలా సంక్షేమ విద్యాసంస్థలు, హాస్టళ్లకు 13,500 టన్నులు, మధ్యాహ్న భోజన పథకానికి 6 వేల టన్నులు, ఐసీడీఎస్‌కు 2,500 టన్నులు.. మొత్తం 22వేల టన్నుల బియ్యం కావాలి. 10 నెలలకు 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం అవసరమని పౌరసరఫరాల సంస్థ గుర్తించింది.

ఇంత అధిక ధరకా?

పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్లలో దేశంలోని ఆరు సంస్థలు పాల్గొని బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం. తొలుత సాంకేతిక బిడ్లు పరిశీలించి అందులో అర్హత సాధించిన వాటిని పరిశీలించారు. ఒక్కో కిలో సన్నబియ్యాన్ని ఎంత ధరకు సరఫరా చేసేది సంస్థలు కోట్‌ చేశాయి. నాలుగు వేర్వేరు టెండర్లకు ఎల్‌-1గా నాలుగు సంస్థలను గుర్తించినట్లు సమాచారం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేంద్రీ బండార్‌ రూ.57, ఎల్‌జీ ఆగ్రో ఇండస్ట్రీస్‌ రూ.56.90, హిందుస్థాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.56.90, నాకాఫ్‌ రూ.56.80 ధరకు టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. వీటిని ఖరారు చేస్తే ఈ నాలుగు సంస్థల నుంచి 1.50 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని సేకరిస్తారు. బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం రూ.45-50 వరకు దొరుకుతున్నాయి. అవి కూడా నూకలు లేనివి. పౌరసరఫరాలశాఖ పిలిచిన టెండర్లలో సరఫరా చేసే బియ్యంలో 10 శాతం వరకు విరిగిన బియ్యానికి వెసులుబాటు కల్పించారు. సన్న బియ్యం టెండర్ల విషయాన్ని ప్రస్తావించగా.. బిడ్లను ఇటీవల తెరిచామని, పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటామని పౌరసరఫరాల సంస్థ జీఎం భాస్కర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని