ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం

దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ అరుణ్‌కుమార్‌ మిశ్రా స్పష్టంచేశారు.

Published : 18 May 2024 04:34 IST

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ అరుణ్‌కుమార్‌ మిశ్రా

ప్రసంగిస్తున్న జస్టిస్‌ అరుణ్‌కుమార్‌ మిశ్రా

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ అరుణ్‌కుమార్‌ మిశ్రా స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో కౌటిల్యా స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ రెండో స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ... ‘‘రాజ్యాంగంలో మొదట హక్కుల గురించే ప్రస్తావించారు. ఈ హక్కుల పరిరక్షణలో భాగంగా పర్యావరణం, ప్రజల మానసిక ఆరోగ్యం, సైబర్‌ చట్టాలతోపాటు ట్రాన్స్‌జెండర్లు, ట్రక్‌ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికుల హక్కులు, అంధులకు పునరావాస కేంద్రాల ఏర్పాటు, టపాసుల తయారీ నిషేధం, కారాగారాల్లో ఖైదీల ఆత్మహత్యల నివారణ వంటివాటిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కృషి చేస్తోంది. పిల్లలపై లైంగిక దాడుల నివారణ, ఇంటర్నెట్‌ నుంచి సంబంధిత వీడియోల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా మానవ హక్కులకు భంగం కలిగితే సుమోటోగా స్వీకరిస్తున్నాం. 

యువతే మనదేశ సంపద 

మన దేశానికి యువతే సంపద. వారు దేశ సమగ్రత, నైతిక సూత్రాలకు కట్టుబడి నడుచుకోవాలి. ఒకవైపు మనదేశం అభివృద్ధి సాధిస్తున్నా కుల ఆధారిత అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. అణగారిన వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు ముఖ్యమైన సాధనం. ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యం సాధించే వరకు రిజర్వేషన్ల ప్రయోజనాలను వారికి అందించాల్సిందే’’ అని స్పష్టంచేశారు. అంతకుముందు గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్‌ అధ్యక్షోపన్యాసం చేస్తూ పట్టభద్రులకు అభినందనలు తెలిపారు. కౌటిల్యా డీన్‌ ప్రొఫెసర్‌ సయ్యద్‌ అక్బరుద్దీన్, ఉపకులపతి ప్రొఫెసర్‌ డి.ఎస్‌.రావు, గీతం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ డి.గుణశేఖరన్‌ పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని