ఇంటి దీపం కావాలి.. మా కలలకు రూపం ఇవ్వాలి!

‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు.

Published : 18 May 2024 04:42 IST

 దత్తతలో ఆడపిల్లలకే అగ్రతాంబూలం
 నాలుగేళ్లలో రాష్ట్రం నుంచి 798 మంది..
 విదేశీ దంపతులకు దత్తతలో తెలంగాణ రెండోస్థానం

‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు. వారు తమ కలలకు రూపం కల్పించాలని ఉవ్విళ్లూరుతున్నారు. మగపిల్లల కన్నా ఆడపిల్లలే ముద్దు అని, వారు ఉంటే ఇల్లంతా పండగే అని, చివరి క్షణాల్లో ప్రేమగా చూసుకునేది ఆడపిల్లలే అని చెబుతున్నారు. అందుకే రాష్ట్రం నుంచి జరుగుతున్న దత్తత ప్రక్రియలో ఆడపిల్లల సంఖ్యనే ఎక్కువగా ఉంటోంది. ఆడపిల్లలకు జన్మనిచ్చిన మాతృమూర్తులు పేదరికం, నిస్సహాయ పరిస్థితులు తదితర కారణాలతో పేగుబంధాన్ని కాదనుకుని పుట్టిన వెంటనే వదిలేసుకుంటుంటే.. పిల్లలు లేక, సంతానం కోసం తపన పడుతున్న దంపతులు ఆడపిల్లలనే కోరుకుంటున్నారు. మగపిల్లల్ని దత్తత తీసుకునేందుకు అవకాశమున్నా వారు ఆడపిల్లలకే అగ్రతాంబూలం ఇస్తున్నారు. రాష్ట్రం నుంచి నాలుగేళ్లలో 798 మంది చిన్నారులు మన దేశంతోపాటు విదేశాలకు దత్తతకు వెళ్తే.. అందులో 527 మంది ఆడపిల్లలే.


నివేదికల తయారీలో జాప్యం

పిల్లలు లేని దంపతులు చట్టబద్ధంగా దత్తత కోసం కేంద్రీయ దత్తత వనరుల సంస్థ(కారా)కు దరఖాస్తు చేసుకుంటారు. దీని కింద తీసుకున్న దత్తతే చెల్లుబాటు అవుతుంది. ఇతర మార్గాల ద్వారా తీసుకోవడం నేరం. దీంతో చాలా మంది దంపతులు ‘కారా’ను ఆశ్రయిస్తున్నారు. దత్తత కోసం రిజిస్టరు చేసుకున్న తర్వాత శిశు సంక్షేమ శాఖ అధికారులు.. వారి సామాజిక, ఆరోగ్య, ఆర్థిక, వ్యక్తిగత వివరాలను సేకరించి, వాటిని పరిశీలించి మూడు నుంచి ఆరు నెలల్లో నివేదికలను రూపొందించాలి. ఆ తర్వాతే దత్తత కోరుకునే దంపతులు సీనియారిటీ జాబితాలో చేరతారు. అయితే పాలనాపరమైన లోపాలు, కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రక్రియ పూర్తిలో తీవ్రజాప్యం చోటుచేసుకుంటోంది. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి శిశు సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికలు వెంటనే రూపొందించి, వెయిటింగ్‌ లిస్టులోని సంఖ్యను తగ్గించాలని ఆదేశించారు. 


రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు నిరీక్షణ

పేద, నిస్సహాయ స్థితిలోని కుటుంబాలు వదిలేసిన, రోడ్లపై దొరికిన చిన్నారులు, అమ్మానాన్నలు లేని పిల్లలను శిశు సంక్షేమ శాఖ అధికారులు చేరదీస్తున్నారు. పిల్లల సంరక్షణ కమిటీ(సీడబ్ల్యూసీ) ఆమోదంతో వారికి శిశువిహార్, శిశుగృహాల్లో పునరావాసం కల్పిస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ శిశువిహార్‌తో పాటు జిల్లాల్లోని శిశుగృహాలు చిన్నారులకు సంరక్షణ కేంద్రాలుగా ఉన్నాయి. రోజుల పిల్లల నుంచి మూడేళ్ల లోపు పిల్లల్ని ప్రత్యేక సంరక్షణలో పెడుతున్నారు. న్యాయప్రక్రియ పూర్తయిన అనంతరం పిల్లలు లేని దంపతులకు ‘కారా’ నిబంధనల ప్రకారం దత్తతకు అనుమతిస్తున్నారు. అయితే దత్తత కోసం రిజిస్టరు చేసుకున్న దంపతులు రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు ఎదురుచూడాల్సి వస్తోంది.


తెలంగాణ నుంచే ఎక్కువ..

దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణ నుంచి దత్తతల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గడిచిన రెండేళ్లలో దేశీయ దత్తతల్లో తెలంగాణ రాష్ట్రం ఏడో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే విదేశీ దత్తతల్లో రెండేళ్లుగా తెలంగాణ రెండో స్థానంలో ఉంది. వివిధ రాష్ట్రాలు, విదేశాలకు చెందిన దంపతులు దత్తత తీసుకున్న చిన్నారుల యోగక్షేమాలను శిశు సంక్షేమ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని