ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు

ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు.

Updated : 19 May 2024 05:29 IST

ఎన్‌హెచ్‌ఎం రెండేళ్ల కార్యక్రమం ఖరారు
రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. ఇందులో 60 శాతం నిధులను కేంద్రం అందించనుండగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతం. ఎన్‌హెచ్‌ఎం ద్వారా 2024-25, 2025-26 సంవత్సరాల్లో వ్యయం చేయాల్సిన మొత్తం, ఆరోగ్య కార్యక్రమాలపై రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆమోదం తెలిపింది. రెండేళ్ల కార్యక్రమాలను ఖరారు చేయడంతోపాటు అనుసరించాల్సిన నిబంధనలను స్పష్టం చేసింది.

మాతాశిశు సంరక్షణ సహా వ్యాధుల నిర్మూలనకు.. 

మాతాశిశు సంరక్షణతోపాటు వ్యాధుల నిర్మూలన లక్ష్యంగా ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమాలను అమలు చేస్తోంది. 2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలన, 2027 నాటికి మలేరియా నివారణతోపాటు ఫైలేరియా, కుష్ఠు వ్యాధి నివారణ లక్ష్యాలను చేరుకునే దిశగా కార్యాచరణను నిర్దేశించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌(ఎన్‌ఆర్‌హెచ్‌ఎమ్‌), జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌(ఎన్‌యూహెచ్‌ఎమ్‌) ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించనున్నారు. మాతా శిశు సంరక్షణలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు ఎక్కువ మొత్తంలో నిధులను ప్రతిపాదించారు. ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్, ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్, వెల్‌నెస్‌ సెంటర్లు, అంటువ్యాధులు కాని వాటి నివారణ వంటి కేంద్రం నిర్దేశించిన కార్యక్రమాలను అమలు చేయనున్నారు. బాలింతలు, శిశుమరణాల రేటును మరింత తగ్గించడంతోపాటు ఆరోగ్య సంరక్షణకు వివిధ అంశాలను సూచించారు. గర్భిణుల వివరాల నమోదు, వందశాతం ఆసుపత్రి ప్రసవాలు ఉండేలా కార్యాచరణను నిర్దేశించారు. మొత్తం 17 వేలమంది దాకా ఆరోగ్య సిబ్బంది విధుల్లో భాగస్వామ్యం కానున్నారు. వీరిలో వైద్యాధికారులు, ఆయుష్‌ వైద్యాధికారులు, ఐదు వేలమందికి పైగా ఏఎన్‌ఎంలు, రెండువేల మందికిపైగా స్టాఫ్‌నర్సులు సహా ల్యాబ్‌ టెక్నీషియన్లు, 600 మందికిపైగా ఫార్మాసిస్ట్‌లు, మూడువేలమందికి పైగా కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు సహా వివిధ కేటగిరీల్లో ఉద్యోగులను ప్రతిపాదించారు. 

నిబంధనలివీ 

  • కేంద్రం విడుదల చేసే ఎన్‌హెచ్‌ఎం నిధులను 21 రోజుల్లో నోడల్‌ ఖాతాలకు బదిలీ చేయాలి. ఆ తర్వాత విధిగా 40 రోజుల్లోపే రాష్ట్ర వాటాను విడుదల చేయాలి. 
  • ఎన్‌హెచ్‌ఎంలో కేంద్ర, రాష్ట్ర వాటాలను వేర్వేరుగా నిర్వహించాలి. 
  • సివిల్‌ పనులపై థర్డ్‌పార్టీ పర్యవేక్షణ ఉండాలి. కొనసాగుతున్న పనుల వివరాలు ఎన్‌హెచ్‌ఎం వెబ్‌సైట్‌లో విధిగా ఉండాలి.
  • ఇక్కడ చేపట్టే పనులను ఏ ఇతర నిధుల ద్వారా చేపట్టలేదనే అంశాన్ని నిర్ధారిస్తూ నాన్‌ డూప్లికేషన్‌ సర్టిపికెట్‌ తప్పనిసరిగా సమర్పించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని