విద్యుత్‌ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు

ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్‌) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్‌ అధికారులను నియమించారు.

Published : 19 May 2024 04:30 IST

ఎన్పీడీసీఎల్‌ పరిధిలో ‘సైదీ సైఫీ’ విధానం అమలు
అటవీ ప్రాంతాల్లో ‘ఫాల్ట్‌ ప్యాసేజ్‌ ఇండికేటర్‌’

ఇటీవల ఆసిఫాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని ఎస్‌ఎస్‌ కౌటాల విద్యుత్‌
ఉపకేంద్రాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడుతున్న సీఎండీ వరుణ్‌రెడ్డి

ఈనాడు, వరంగల్‌: ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్‌) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్‌ అధికారులను నియమించారు. వీరు విద్యుత్‌ సరఫరా నష్టాలను తగ్గించి, నాణ్యత పెంచడంతోపాటు సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకుంటారు. మరోవైపు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఎక్కడ కలిగింది, ఎంత సమయం కరెంటు నిలిచిపోయిందనే వివరాలు పక్కాగా తెలుసుకునేందుకు ‘సైదీ సైఫీ’ విధానం అమలు చేస్తున్నారు. దీని ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్వహణ చేపడుతుండటంతో ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యం 33 శాతం తగ్గినట్టు అధికారులు గుర్తించారు. ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం లాంటి చోట్ల దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఫీడర్లు ఉన్నచోట రూ.13 కోట్లతో ‘ఫాల్ట్‌ ప్యాసేజ్‌ ఇండికేటర్‌’ విధానం ప్రారంభించనున్నారు. దీనివల్ల ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో అంతరాయం ఎక్కడ ఏర్పడిందో కనుగొని, సేవలను వెంటనే పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ‘కవ్వాల్‌’ అభయారణ్యంలో ఉప కేంద్రం నుంచి ఫీడర్‌ 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాంటిచోట్ల విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగితే కొత్త విధానంలో సత్వరంగా సేవలు పునరుద్ధరిస్తారు. మరోవైపు, వర్షాకాలం నేపథ్యంలో రాత్రివేళల్లోనూ సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా సీఎండీ వరుణ్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. కరెంటు సరఫరా పరిస్థితిని పరిశీలించేందుకు ఆయన అర్ధరాత్రి పూట కూడా సబ్‌స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.

మేటి సేవలు అందించే ఉద్యోగులకు బహుమతులు

ఎన్పీడీసీఎల్‌ పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను గణనీయంగా తగ్గించి, వినియోగదారులకు మేలైన సేవలు అందించేందుకు ఉద్యోగుల పనితీరును మెరుగుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తున్న ఉద్యోగులకు ‘బెస్ట్‌ పర్ఫార్మర్స్‌ ఆఫ్‌ ద మంత్‌’ పేరుతో బహమతులు ఇవ్వాలని సీఎండీ నిర్ణయించారు. ఇంజినీరింగ్‌ అధికారుల నుంచి జూనియర్‌ లైన్‌మెన్ల వరకు వీటిని ఇస్తారు. ఏప్రిల్‌ నెలకు సంబంధించి 16 సర్కిళ్లలో 54 మంది ఉద్యోగులను ఎంపిక చేశారు. ఇలా ప్రతి నెలా మేటి పనితనం కనబరిచిన ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని