ఆధార్‌ అనుసంధానం కాకున్నా..‘డెత్‌ క్లెయిమ్‌’లు పరిష్కరించండి

ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్‌ నంబర్‌ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్‌లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్‌వో వెసులుబాటు కల్పించింది.

Updated : 20 May 2024 06:04 IST

 ఈపీఎఫ్‌వో ఆదేశాలు
పీఎఫ్‌ చందాదారులకు తాత్కాలిక ఉపశమనం

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్‌ నంబర్‌ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్‌లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్‌వో వెసులుబాటు కల్పించింది. ఆయా క్లెయిమ్‌లను తాత్కాలిక ఉపశమనం కింద పరిశీలించాలని ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది. ఈ మేరకు అదనపు ప్రధాన కమిషనర్‌ ఎంఎస్‌కేవీవీ సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు. ఈపీఎఫ్‌వో క్లెయిమ్‌లు పరిశీలించాలంటే ఆధార్‌ తప్పనిసరి. అయితే మరణించిన సభ్యుల కేసుల్లో ఆధార్‌ ధ్రువీకరణ కష్టంగా మారుతోంది. అనేక సందర్భాల్లో సభ్యుడి వివరాలు, ఆధార్‌లోని వివరాలు సరిపోలడం లేదు. ఆధార్‌ అమల్లోకి రాకముందు చనిపోయిన సభ్యులతో పాటు కొందరికి ఆధార్‌ డీయాక్టివేట్‌ కావడం, ఇతర సాంకేతిక కారణాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా ఆధార్‌ అనుసంధానం కాకపోవడంతో క్షేత్రస్థాయిలోని కార్యాలయాల్లో కాగితరూప క్లెయిమ్‌లు పరిశీలించలేకపోతున్నామని, దీంతో చందాదారులకు సకాలంలో క్లెయిమ్‌లు అందడం లేదని ఈపీఎఫ్‌వో అధికారులు కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ విషయాలను పరిశీలించిన కేంద్ర కార్యాలయం.. సభ్యుడు చనిపోయిన తరువాత ఆధార్‌ వివరాల్లో మార్పులు చేయడం కష్టమని, ఈ నేపథ్యంలో ఆధార్‌ లేకున్నా నిబంధనలకు లోబడి క్లెయిమ్‌లు ప్రాసెస్‌ చేయాలని సూచించింది. వివరాలన్నీ ఈ-ఆఫీస్‌ దస్త్రం కింద ఇన్‌ఛార్జి అధికారి పరిశీలించి, నిజమైన క్లెయిమ్‌లుగా గుర్తించిన తరువాతే ప్రాసెస్‌ చేయాలని తెలిపింది. ఈ వెసులుబాటు పీఎఫ్‌ ఖాతా వివరాలు సరిగా ఉన్నప్పటికీ, ఆధార్‌ వివరాలు అసంపూర్తిగా, సరిగా లేని కేసులకే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలానే ఆధార్‌ వివరాలు సక్రమంగా ఉండి.. కేవలం పీఎఫ్‌ ఖాతాలో వివరాలు అసంపూర్తిగా ఉంటే ఈపీఎఫ్‌వో నిబంధనలకు లోబడి పరిష్కరించాలని వెల్లడించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని