ప్రమాదంలో భావప్రకటన స్వేచ్ఛ

దేశంలో భావప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డా.ఎస్‌.మురళీధర్‌ అన్నారు.

Published : 20 May 2024 02:59 IST

బ్రిటిష్‌ హయాం నాటి క్రూరచట్టాలను సవరించాలి
ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మురళీధర్‌

సుందరయ్య చిత్రపటం వద్ద నినాదాలు చేస్తున్న వినయ్‌కుమార్, తెలకపల్లి రవి, జస్టిస్‌ మురళీధర్, బీవీ రాఘవులు

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: దేశంలో భావప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డా.ఎస్‌.మురళీధర్‌ అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(2)పై నియంత్రణ తెచ్చి భావప్రకటన స్వేచ్ఛను కేంద్రంలోని భాజపా సర్కార్‌ అణచివేస్తోందని చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వాన్ని మేధావులు, పౌరులు ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలపై నిర్బంధానికి పాల్పడడం తగదన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో.. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీ దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం-భావప్రకటన స్వేచ్ఛ-నేటి వాస్తవాలు అంశంపై స్మారకోపన్యాసం జరిగింది. ఆయన మాట్లాడుతూ భారత్‌ మతసామరస్యానికి ప్రతీక అని, భాజపా ప్రభుత్వ విధానాలతో దానికి విఘాతం కలుగుతోందని చెప్పారు. బ్రిటిష్‌ హయాం నాటి క్రూరచట్టాలను ప్రస్తుతం సవరించాల్సి ఉందన్నారు. న్యాయవాది కన్నబీరన్‌ తన ఆత్మకథ పుస్తకంలో ప్రాథమిక హక్కుల అమలును చక్కగా వివరించారన్నారు. ప్రబీర్‌ పుర్‌కాయస్థ సహా కశ్మీర్‌కు సంబంధించిన ఫొటో జర్నలిస్ట్‌లు నిజాలను వెలికితీస్తే.. వారిపై కేంద్ర ప్రభుత్వం రాజద్రోహం కేసులు బనాయించిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై మోజు యువతను పెడదోవ పట్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య గొప్ప ప్రజానేత అని కొనియాడారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు భాజపా సర్కార్‌ యత్నిస్తోందని ఆరోపించారు. సభలో ఎస్వీకే ట్రస్ట్‌ కార్యదర్శి వినయ్‌కుమార్, సభ్యుడు బుచ్చిరెడ్డి, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు