వాతావరణ మార్పులతో ‘ఆర్థిక విధ్వంసం’

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఊహించిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది.

Published : 20 May 2024 03:11 IST

టన్ను కార్బన్‌ డయాక్సైడ్‌తో సమాజానికి రూ.88 వేల నష్టం
అమెరికాలోని నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ పరిశోధనలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఊహించిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగినా ప్రపంచ జీడీపీ క్రమేపీ తగ్గుతోందని, కొన్ని సందర్భాల్లో గరిష్ఠంగా 12 శాతం వరకు నష్టం కలుగుతోందని తెలిపింది. పారిశ్రామికీకరణ తర్వాత చోటుచేసుకున్న వాతావరణ మార్పులతో కలిగిన నష్టాలు.. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన ఆర్థిక, సామాజిక, పర్యావరణ విధ్వంసం కన్నా ఎక్కువని వెల్లడించింది. కర్బన ఉద్గారాల పెరుగుదల, ఉష్ణోగ్రతల్లో మార్పులతో విపత్తులు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక టన్ను కార్బన్‌ డయాక్సైడ్‌ సమాజానికి రూ.87,965 ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోందని వెల్లడించింది. అమెరికాలోని నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ ‘‘వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం- అంతర్జాతీయ, స్థానిక ఉష్ణోగ్రతలు’’ పేరిట పరిశోధన పత్రం విడుదల చేసింది. ఈ పరిశోధనలో హార్వర్డ్‌ యూనివర్సిటీ అర్థశాస్త్ర అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆడ్రియన్‌ బిలాల్, నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ అర్థశాస్త్ర అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డియాగో ఆర్‌.కాన్జిగ్‌ పాల్గొన్నారు. 1960కి ముందు నుంచి ఇప్పటివరకు వివిధ దేశాలు, అంతర్జాతీయ ఉష్ణోగ్రతలు, ఆర్థిక వ్యవస్థ ప్రభావంపై వీరు పరిశోధన చేశారు. జీరో కార్బన్‌ దిశగా స్థానిక ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఈ ఖర్చు అమెరికా లాంటి పెద్ద దేశాలు భరించలేని స్థాయికి చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.


నివేదికలో ఏముందంటే...

  • పేద, మధ్య, ధనిక దేశాల్లో మధ్యస్థాయి వాతావరణ మార్పుల హెచ్చరికలతో ఉత్పాదక నష్టాలు పెరుగుతున్నాయి. ఉష్ణతాపం, వాతావరణ మార్పులు ఇలాగే పెరిగితే 2050 నాటికి ప్రపంచ ఉత్పాదకత 30 శాతానికి, 2100 నాటికి 50 శాతానికి తగ్గే ప్రమాదముంది. 
  • డీకార్బనైజేషన్‌ విధానాలకు ఖర్చు బాగా పెరిగింది. టన్ను కార్బన్‌ డయాక్సైడ్‌ డీకార్బనైజేషన్‌కు రూ.2,249 నుంచి రూ.7,913 వరకు ఖర్చవుతోంది. అమెరికాలో ఈ ఖర్చు 30 డాలర్ల (రూ.2499) నుంచి 211 డాలర్ల (రూ.17,576)కు పెరిగింది. 
  • 1960 నుంచి 2024 వరకు గణాంకాలను పరిశీలిస్తే.. భూతాపం పెరగకుండా ఉంటే ఈరోజు ప్రపంచ తలసరి జీడీపీ 37 శాతం ఎక్కువగా ఉండేది. కానీ, భూతాపం 0.75 శాతం పెరగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వార్షిక వృద్ధిలో 29 శాతం కోత పడింది. 
  • 1960కు ముందుతో పోల్చితే ప్రపంచ సాధారణ ఉష్ణోగ్రతలు 2100 నాటికి 4 డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 2023 నాటికి సగటు ఉష్ణోగ్రత 1.48 డిగ్రీలు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల చొప్పున పెరిగితే ఉత్పాదక ఖర్చులు తీవ్రంగా పెరిగి ఆదాయ వనరులు 60 శాతానికి తగ్గిపోతాయి. 
  • ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరగడంతో అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర గాలులు, భారీ వర్షాలు, ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. ఏడాదిలో ఎక్కువ రోజులు ఉష్ణతాప దినాలుగా ఉంటున్నాయి. 
  • ఉష్ణతాపం, విపత్కర వాతావరణ పరిస్థితులతో స్థానికంగా పెట్టుబడులు తగ్గిపోయి, అభివృద్ధి నిలిచిపోతుంది. తద్వారా ఆదాయం, ఉత్పాదకత పడిపోయి.. పెట్టుబడులకు తీవ్ర నష్టం జరుగుతుంది. 
  • ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగినందువల్ల కొన్ని దేశాల్లో తలెత్తిన వాతావరణ మార్పులతో ఆ ఏడాదికి జీడీపీ గరిష్ఠంగా 12 శాతానికి పడిపోతోంది. ఆ తర్వాత ఆరేళ్లయినా పూర్వస్థితికి చేరుకోలేకపోతోంది. కొన్ని దేశాల్లో ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని