ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంతో పట్టణ రాష్ట్రంగా తెలంగాణ

పెట్టుబడులకు హైదరాబాద్‌ స్వర్గధామమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అనుకూలమైన వాతావరణం, మంచి నీటి వసతి, నిరంతర విద్యుత్తు సరఫరా, శాంతిభద్రతలు, స్నేహపూర్వక ప్రభుత్వం కారణంగా హైదరాబాద్‌ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని చెప్పారు.

Published : 20 May 2024 08:19 IST

పెట్టుబడులకు హైదరాబాద్‌ స్వర్గధామం
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 

సమావేశంలో మాట్లాడుతున్న మల్లు భట్టి విక్రమార్క. వేదికపై శ్రీనివాసమూర్తి, ప్రశాంత్,
ఆనంద్, శేఖర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సాయి దేవరాజుల ప్రసాద్, రాజశేఖర్‌రెడ్డి 

మాదాపూర్, న్యూస్‌టుడే: పెట్టుబడులకు హైదరాబాద్‌ స్వర్గధామమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అనుకూలమైన వాతావరణం, మంచి నీటి వసతి, నిరంతర విద్యుత్తు సరఫరా, శాంతిభద్రతలు, స్నేహపూర్వక ప్రభుత్వం కారణంగా హైదరాబాద్‌ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని చెప్పారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణంతో తెలంగాణ పట్టణ రాష్ట్రంగా రూపొందుతుందన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటుచేసిన మూడు రోజుల గ్రీన్‌ ప్రాపర్టీ షో ఆదివారం సాయంత్రం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం ఆలస్యమైందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో గ్రీన్, నెట్‌ జీరో కాన్సెప్ట్‌లకు సీఐఐ-ఐజీబీసీ సహకారం అందించాలన్నారు. పర్యావరణాన్ని కాపాడేలా హరిత భవన నిర్మాణాలు చేపట్టేందుకు ఐజీబీసీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్రంలో 146 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం పూర్తికావడం... 2.50 లక్షల రెసిడెన్షియల్‌ యూనిట్లను పర్యావరణహితం (గ్రీన్‌)గా మార్చడం ఓ పెద్ద ముందడుగని పేర్కొన్నారు. 50 శాతం నీరు, 40 శాతం విద్యుత్తును ఆదా చేసే రీతిలో నిర్మించే హరిత భవనాలకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. గతం నుంచీ కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలకుల దూర దృష్టి కారణంగానే హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు, శంషాబాద్‌ విమానాశ్రయం, కృష్ణా జలాలు, మెట్రోరైలుకు శంకుస్థాపన వంటి అనేక కార్యక్రమాలు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ప్రాణం పోసుకున్నాయని పేర్కొన్నారు.

మూడు నెలల్లో పనులు ప్రారంభం...

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందనున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సూపర్‌ గేమ్‌ఛేంజర్‌ అవుతుందన్నారు. మూడు, నాలుగు నెలల్లో నిర్మాణం ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా తమది వన్‌ మ్యాన్‌షో కాదని... సమష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఐజీబీసీ నేషనల్‌ వైస్‌ఛైర్మన్‌ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణహితమైన హరిత భవనాలు నిర్మించేవారికి, కొనేవారికి ఆస్తిపన్ను, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రాపర్టీ షోలో స్టాళ్లు ఏర్పాటు చేసిన పలు నిర్మాణ సంస్థలకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో సీఐఐ తెలంగాణ ఛైర్మన్‌ సాయి దేవరాజుల ప్రసాద్, క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, హైసియా అధ్యక్షుడు ప్రశాంత్, ఐజీబీసీ డిప్యూటీ డైరెక్టర్‌ ఆనంద్, సీఐఐ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటగిరి, ఐజీబీసీ కో ఛైర్‌పర్సన్‌ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని