‘మత్తు’ నియంత్రణకు కదిలిన యంత్రాంగం

రాష్ట్రంలో నాటుసారాను మూడు నెలల్లో నిర్మూలించడంతోపాటు గంజాయిని నియంత్రించాలనే లక్ష్యంలో భాగంగా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాచరణ ప్రారంభించింది.

Published : 20 May 2024 03:14 IST

 నల్గొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ముమ్మర దాడులు
గంజాయి, ఆలం, నల్లబెల్లం పట్టివేత

నల్గొండ జిల్లా పిట్లంపల్లిలో ఎక్సైజ్‌ ఎస్టీఎఫ్‌ బృందం స్వాధీనం చేసుకున్న గంజాయి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నాటుసారాను మూడు నెలల్లో నిర్మూలించడంతోపాటు గంజాయిని నియంత్రించాలనే లక్ష్యంలో భాగంగా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 26 ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో నాటుసారా తయారు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించి.. నిఘా పెంచారు. ఎక్సైజ్‌ కమిషనర్‌ ఇ.శ్రీధర్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి ఇటీవలే సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేయడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు దాడులు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి నల్లబెల్లం, ఆలం.. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో నుంచి గంజాయిని దిగుమతి చేస్తున్న వాహనాలపై నిఘా పెంచారు. శనివారం రాత్రి నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడు పిట్లంపల్లి ప్రాంతంలో లారీ, కారు, ఆటో రిక్షాల్లో తరలిస్తున్న 47.5 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్‌ ఎస్టీఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి హైదరాబాద్‌లోని ధూల్‌పేట, పుప్పాలగూడలకు వీటిని తీసుకొస్తున్నట్లు వెల్లడైంది. విప్లవ్‌ మహతో, సంజయ్‌ బిశ్వాస్‌ అనే ఇద్దరు వ్యక్తులు.. చిట్యాకు ముడి ఇనుము తీసుకొచ్చే లారీ డ్రైవర్‌ బిట్టూరాయ్‌కి డబ్బు ఆశ చూపి.. గంజాయి రవాణా చేయించారు. విప్లవ్, సంజయ్‌ కారులో లారీని అనుసరించారు. ధూల్‌పేట నుంచి ఆటోలో పిట్లంపల్లికి వచ్చిన రాజాబాబుకు వీరు సరకును అప్పగిస్తుండగా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అంజిరెడ్డి నేతృత్వంలోని ఎస్‌టీఎఫ్‌ బృందం పట్టుకుంది. 

కర్ణాటక, మహారాష్ట్రల నుంచి..

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి ప్రాంతంలో శనివారం రాత్రి ఓ కారును తనిఖీ చేయగా.. అందులో 35 నల్లబెల్లం సంచులు, 30 కిలోల ఆలం, 4 లీటర్ల నాటుసారా లభ్యమయ్యాయి. వీటితోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే జిల్లాలోని ముక్కిడిగుండంకు చెందిన రాంబాబు, భాస్కర్‌శెట్టిలను అరెస్ట్‌ చేశారు. కర్ణాటకలోని గుర్మిట్‌కల్‌ నుంచి వీటిని తీసుకొస్తున్నట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని లాతూర్‌ నుంచి ఓ ట్రక్కులో నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం తెలకపల్లికి అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల విలువ చేసే ఆలంతోపాటు రూ.5 లక్షల విలువైన నల్లబెల్లాన్నీ పట్టుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని