29, 30 తేదీల్లో వనదేవతల గద్దెలకు తాళాలు

మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు.

Updated : 20 May 2024 05:54 IST

మేడారం(తాడ్వాయి), న్యూస్‌టుడే: మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. స్థల కేటాయింపుపై ప్రభుత్వం, దేవాదాయ అధికారుల తీరును నిరసిస్తూ ఆ తేదీల్లో ప్రాంగణం వద్ద ధర్నా నిర్వహించనున్నామని ఆదివారం వెల్లడించారు. 1993లో మేడారం జాతర భవిష్యత్తు అవసరాల కోసం వరంగల్‌లోని కేంద్ర కారాగారానికి ఎదురుగా 1000 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. ఇందులో ఏడాది క్రితం భద్రకాళి, మెట్టుగుట్ట, మేడారం జాతర నిధులతో ధార్మిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని, స్థలాన్ని భద్రకాళి దేవస్థానం అధీనంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని,  స్థలం వనదేవతలదని, నిర్మాణ ఖర్చులను జాతర ఆదాయం నుంచి ఇస్తామని, స్థలం, భవనం అప్పగించాలని పూజారులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై మంత్రి సీతక్క, కలెక్టర్, దేవాదాయశాఖ అధికారులకు వినతిపత్రాలిచ్చినా స్పందన లేకపోవడంతో గద్దెలు, ప్రాంగణానికి తాళాలు వేసి, ధర్నా నిర్వహించనున్నామని పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, పూజారులు ఆదివారం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని