రెండు, మూడు నెలల్లో… బీబీనగర్‌-గుంటూరు డబ్లింగ్‌ పనులు

తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్‌-గుంటూరు రెండో లైన్‌ పనులు రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 

Updated : 20 May 2024 05:51 IST

తుది దశలో టెండర్ల ప్రక్రియ.. త్వరలో గుత్తేదారు ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్‌-గుంటూరు రెండో లైన్‌ పనులు రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్‌ లైన్‌ మాత్రమే ఉండగా, డబ్లింగ్‌ ప్రాజెక్టు గతేడాది మంజూరైంది. టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉంది. దాఖలైన బిడ్లను పరిశీలిస్తున్నట్లు.. త్వరలోనే గుత్తేదారును ఎంపిక చేయనున్నట్లు రైల్వేవర్గాల సమాచారం. 

అదనపు రైళ్లు.. అధిక వేగం...

బీబీనగర్‌-గుంటూరు రెండో లైన్‌ నిర్మాణానికి రూ.2,853 కోట్ల వ్యయం అవుతుందని రైల్వేశాఖ అంచనా వేసింది. 293 కిలోమీటర్ల లైన్‌ నిర్మాణం తర్వాత రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ 11.02 శాతం వస్తుందని రైల్వేశాఖ అధ్యయనంలో తేలింది. బీబీనగర్‌-గుంటూరు మార్గంలో ఇప్పటికే సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్, సికింద్రాబాద్‌-విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్‌ సహా నారాయణాద్రి, విజయవాడ ఇంటర్‌సిటీ, గుంటూరు ఇంటర్‌సిటీ, శబరి, ఫలక్‌నుమా, నర్సాపూర్, జన్మభూమి, విశాఖ, గోల్కొండ, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ వంటి ముఖ్యమైన రైళ్లు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. డబ్లింగ్‌ పూర్తయితే ఈ మార్గంలో మరిన్ని రైళ్లు ప్రవేశపెట్టొచ్చు. ఇప్పుడు తిరుగుతున్న రైళ్ల వేగాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. రైళ్లను మరిన్ని స్టేషన్లలో ఆపేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. జూన్‌లో కేంద్రంలో కొత్తగా ప్రభుత్వం కొలువుదీరుతుంది. జులై నెలలో కేంద్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అందులో అధిక నిధులు కేటాయిస్తే పనుల్ని వేగంగా మొదలుపెట్టేందుకు వీలవుతుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు