తాత్కాలిక మరమ్మతులు ప్రారంభం

మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం ప్రకారం నడుచుకోని నిర్మాణ సంస్థపైన, బాధ్యులైన ఇంజినీర్లపైన కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో కదలిక వచ్చింది.

Updated : 21 May 2024 07:12 IST

సీఎం రేవంత్‌ హెచ్చరికతో కదలిక
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పనులు మొదలు

అన్నారం బ్యారేజీలో కొనసాగుతున్న సీసీ బ్లాకుల అమరిక

ఈనాడు హైదరాబాద్‌: మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం ప్రకారం నడుచుకోని నిర్మాణ సంస్థపైన, బాధ్యులైన ఇంజినీర్లపైన కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో కదలిక వచ్చింది. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) సూచన మేరకు జియోటెక్నికల్, జియో ఫిజికల్, కాంక్రీటు ఇన్వెస్టిగేషన్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని పుణెలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చి స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌)కు మేడిగడ్డ బ్యారేజీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సోమవారం లేఖ రాశారు. గత ఏడాది అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లో పియర్స్‌ కుంగి, గేట్లు దెబ్బతిన్నాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ సీపేజీలు ఏర్పడ్డాయి. దీనిపై అధ్యయనం చేసిన ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ వర్షాకాలంలో అన్ని గేట్లు ఎత్తి ఉంచాలని, మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో రెండు గేట్లు పూర్తిగా తొలగించాలని, సీసీ బ్లాకులు, లాంచింగ్‌ ఆప్రాన్, రాఫ్ట్‌లకు తాత్కాలిక మరమ్మతులు చేయించాలని, మూడు బ్యారేజీలపైనా సమగ్ర పరిశీలన చేయించాలని సిఫార్సు చేసింది. ఇవన్నీ చేసినా బ్యారేజీల స్ట్రక్చర్‌పై వరద ప్రభావం ఎలా ఉంటుందో చెప్పలేమంది. ఈ నివేదిక మే ఒకటిన రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శికి అందింది. అయితే డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ ముగిసినందున మరమ్మతుల బాధ్యత తమది కాదని, అనుబంధ ఒప్పందం చేసుకొంటేనే పనులు ప్రారంభిస్తామని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ తెలిపింది. 2021 మార్చి 15న పని పూర్తయినట్లు ఇంజినీర్లు ఇచ్చిన ధ్రువపత్రం ఆధారంగా లేఖ రాసింది. అయితే లేఖ ఇచ్చిన తర్వాత కూడా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి గడువు పొడిగించారని, ఈ లేఖ ఇవ్వడంలో తప్పు జరిగినట్లు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పేర్కొన్నారని, పని బాధ్యత నిర్మాణ సంస్థదేనని స్పష్టంచేస్తూ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ లేఖ రాసినా ఫలితం లేకపోయింది. నీటిపారుదల శాఖ అధికారులు రెండు వారాలపాటు నిర్మాణ సంస్థతో మాట్లాడినా అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. డిజైన్, ఎగ్జిక్యూషన్, నిర్వహణ, క్వాలిటీ కంట్రోల్‌... ఇలా అన్నింటిలోనూ వైఫల్యం జరిగిందని, పని పూర్తయినట్లు ధ్రువపత్రం ఇచ్చాక కూడా పెండింగ్‌ పనులను పూర్తి చేయడానికి గడువు పొడిగించారంటే కాంట్రాక్టు మనుగడలో ఉన్నట్లేనని, బాధ్యులైన ఇంజినీర్లపైన, నిర్మాణ సంస్థపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం ఈ సమావేశం జరగ్గా సోమవారం ఉదయం నుంచే పనులు ప్రారంభమయ్యాయి. 


ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పర్యవేక్షణ బాధ్యత 

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీసీ బ్లాకులను యథాస్థితికి తెచ్చే పనులు మొదలయ్యాయి. మొదటి నాలుగు వరుసలు బైండింగ్‌ చేయించాలని ఎన్డీఎస్‌ఏ సూచించిందని, ఈ పని చేయాలంటే ఇనుపకడ్డీ సైజు ఎంత ఉండాలో సీడీవో చెప్పాల్సి ఉందని నిర్మాణ సంస్థ... ఇంజినీర్ల దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. గ్రౌటింగ్‌ ఎలా చేయాలో డిజైన్‌ ఇంజినీర్లే చెప్పాలని, సీసీ బ్లాకులను హడావుడిగా వేస్తే మళ్లీ కొట్టుకుపోతాయని నిర్మాణ సంస్థ అభిప్రాయపడినట్లు తెలిసింది. వరద ప్రవాహ వేగం... డ్యాం డిజైన్‌ చేసినప్పుడు వేసిన అంచనాకంటే ఎక్కువగా ఉన్నట్లు ఎన్డీఎస్‌ఏ కూడా గుర్తించింది. మేడిగడ్డలో షీట్‌పైల్‌ వేయడానికి అనువైన ప్రాంతాన్ని ఖరారు చేసే పనిలో ఇంజినీర్లు నిమగ్నమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు జియోఫిజికల్, జియోటెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్లతోపాటు పునాదులు, బ్యారేజీ స్ట్రక్చర్‌... పరిస్థితిని తెలుసుకొనేందుకు కాంక్రీటు స్ట్రక్చర్‌ ఇన్వెస్టిగేషన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ డైరెక్టర్‌కు మేడిగడ్డ బ్యారేజీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ లేఖ రాశారు. వీటిలో 20 రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుందని, దీనికి వ్యయం ఎంతవుతుందో వెంటనే తెలపాలని, ఒక బృందాన్ని పంపాలని కోరారు. అన్నారం బ్యారేజీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కూడా సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు, ఎన్డీఎస్‌ఏ సిఫార్సుల మేరకు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ల రోజువారీ పర్యవేక్షణ బాధ్యతను ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అప్పగించామని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని