తడిసిన ప్రతి గింజనూ కొంటాం

వర్షానికి తడిసిన, మొలకెత్తిన ప్రతి వడ్ల గింజనూ కనీస మద్దతు ధరకు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కొనుగోలు  చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం  తీసుకుంది. వానాకాలం పంట నుంచి సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని తీర్మానించింది.

Updated : 21 May 2024 07:42 IST

రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తాం
వానాకాలం నుంచి సన్న వడ్లకు రూ.500 బోనస్‌
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ‘అమ్మ ఆదర్శ పాఠశాలలు’
నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు
నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరానికి మరమ్మతులు
గత ప్రభుత్వ వ్యయాన్ని వృథా కానివ్వం
తెలంగాణ దశాబ్ది వేడుకలకు ముఖ్యఅతిథిగా సోనియా
కేసీఆర్‌ సహా అందరికీ ఆహ్వానాలు
మంత్రిమండలి భేటీలో నిర్ణయాలు
వివరాలు వెల్లడించిన పొంగులేటి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

వర్షానికి తడిసిన, మొలకెత్తిన ప్రతి వడ్ల గింజనూ కనీస మద్దతు ధరకు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కొనుగోలు  చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం  తీసుకుంది. వానాకాలం పంట నుంచి సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని తీర్మానించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) సూచనల మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకుండా తక్కువ ఖర్చుతో ఎత్తిపోసే అవకాశాలపై చర్చించింది. బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేసినా వాటి మనుగడకు భరోసా ఇవ్వలేమంటూ ఇచ్చిన నివేదికలోని అంశాలపై సుదీర్ఘ సమాలోచనలు చేసింది. జూన్‌ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు అవుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీని అవతరణ దినోత్సవాలకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని, ప్రజాకార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించాలన్న తీర్మానాన్ని మంత్రిమండలి ఆమోదించింది. సచివాలయంలో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సుమారు మూడు గంటల పాటు జరిగింది. అనంతరం సమావేశం వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతుల ఖర్చును నిర్మాణ సంస్థలే భరిస్తాయని, ఎల్‌ అండ్‌ టీకి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన ఇంజినీర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న అమ్మ ఆదర్శ పాఠశాలలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షుడిగా శ్రీధర్‌బాబును నియమించినట్లు పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ వేసే ఆలోచన ఉందని చెప్పారు. గత ప్రభుత్వం రేషనలైజేషన్‌ పేరిట మూసివేసిన ఆరు వేల పాఠశాలల్ని తిరిగి తెరిచే కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు. రైతు భరోసాపై నిబంధనలు రూపొందించాల్సి ఉందని, ఆ వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలులో బస్తాకు ఒక్క గింజ తరుగు తీసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. జూన్‌ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు కేసీఆర్‌ను ఆహ్వానిస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. తమ ప్రభుత్వానికి బేేషజాలేమీ లేవని, అందరినీ ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలు చేయనున్నట్లు చెప్పారు.

 రైతులెవరూ ఆందోళన చెందొద్దు

‘‘మంత్రిమండలి సమావేశంలో వ్యవసాయం, విద్య, కాళేశ్వరం ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో యాసంగిలో ఇప్పటివరకు రైతుల నుంచి 36 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ద్వారా సేకరించాం. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు రోజుల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశాం. ఇంత వేగంగా నగదు చెల్లించడమే కాకుండా.. ముందస్తుగా ధాన్యం సేకరించిన సందర్భం దేశంలో ఇదే ప్రథమం. గత పదేళ్లలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. గింజ తరుగు లేకుండా ధాన్యం సేకరించాం. గత పది రోజులుగా పడుతున్న అకాల వర్షాల కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్నిచోట్ల ధాన్యం తడిసింది. ఈ తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. ధాన్యం తడిసిన రైతులెవరూ ఆందోళన చెందవద్దు. కనీస మద్దతు ధరకు రూపాయి కూడా తగ్గకుండా ఇచ్చి కొనుగోలు చేస్తాం. ఇటీవల అకాల వర్షాలతో పంటలకు వాటిల్లిన నష్టంపై జిల్లా కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి సమాచారమిచ్చారు. పంటలు దెబ్బతిన్న వారికి నష్టపరిహారం ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఆలస్యంగా పండించిన ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేయాలని కలెక్టర్లను ఆదేశించాం. 

 విత్తన కొనుగోలు రసీదులు భద్రపర్చుకోవాలి

మధ్యాహ్న భోజన పథకం, వసతిగృహాలు, రేషన్‌ బియ్యం పథకం కోసం ఏటా 36 లక్షల టన్నుల బియ్యం అవసరం. వీటికి సన్న బియ్యం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఇందుకోసం ఇతర రాష్ట్రాల నుంచి సన్న బియ్యం కొనుగోలు చేయవద్దని, వచ్చే సీజన్‌ నుంచి రైతులు పండించిన సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని తీర్మానించాం. ఏయే సన్న రకాలు పండించాలో వ్యవసాయశాఖ ప్రకటిస్తుంది. నకిలీ విత్తనాలు అమ్మేవారు, నకిలీ రసీదులు ఇచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్యాకెట్లలో కాకుండా లూజుగా దొరికే విత్తనాలను రైతులు కొనుగోలు చేయవద్దు. అధికారికంగా గుర్తింపు పొందిన కంపెనీలవే కొనుగోలు చేయాలి. పంట చేతికందేవరకూ రసీదులు భద్రంగా పెట్టుకోవాలి. 

మంత్రివర్గ సమావేశం వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చిత్రంలో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

విద్యావ్యవస్థలో త్వరలో మార్పు.. 

గత ప్రభుత్వం విద్యావ్యవస్థను విస్మరించింది. పాఠశాల, సాంకేతిక, ఉన్నత, నైపుణ్యవిద్యను మా ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా తీసుకుంది. నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, బోధన, బోధనేతర అంశాలకు ప్రాధాన్యమిస్తాం. భవిష్యత్తులో గొప్ప మానవ వనరులను సిద్ధం చేస్తాం. ఈ మార్పును జూన్‌ 12న చూపిస్తాం. అప్పటిలోగా అమ్మ ఆదర్శ పాఠశాలలు అందుబాటులోకి వస్తాయి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్వయం సహాయక సంఘాలు, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా రూ.600 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నాం. ఇప్పటికే రూ.125 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చాం. ఈ పాఠశాలల్ని ఆధునిక ఆదర్శ బడులుగా తీర్చిదిద్దుతాం. మౌలిక సదుపాయాలు, టాయిలెట్లు, అన్ని హంగులతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తాం. మహిళా సంఘాలు ఈ పాఠశాలల్ని నిర్వహిస్తాయి. 

 ఆ డ్యాం ఉంటుందో.. లేదో!

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదికను మంత్రిమండలి పరిశీలించింది. 2019లోనే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలు మొదలయ్యాయి. అప్పటినుంచి సరైన చర్యలు తీసుకోకపోవడంతో కుంగిపోయింది. ‘మేడిగడ్డకు పగుళ్లు వచ్చాయి.. అన్నారంలో లీకేజీలు ఏర్పడ్డాయి.మూడో బ్యారేజీ సుందిళ్ల ప్రమాదంలో ఉంది. ఈ మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకుండా ఫ్రీఫ్లోలో ఉంచాలి. లేకుంటే మిగతా పిల్లర్లకు ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది’ అని నివేదికలో పేర్కొన్నారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేసినా.. ఈ బ్యారేజీ నిలుస్తుందన్న హామీ ఇవ్వలేమని ఎన్‌డీఎస్‌ఏ తెలిపింది. సాంకేతిక (జియో టెక్నికల్‌), భౌతిక (జియో ఫిజికల్‌) అంశాలపై ఇప్పటికే ఆరుగురితో కమిటీ ఏర్పాటు చేసింది. పరీక్షలు పూర్తయ్యేవరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని ఈ కమిటీ తెలిపింది. ఈ పరీక్షలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలతో చేయించాలంటూ.. మూడు సంస్థల పేర్లు సిఫారసు చేసింది. కాళేశ్వరం విషయంలో అథారిటీ సూచనల మేరకు నడుచుకుంటాం. సాధ్యమైతే తాత్కాలిక మరమ్మతులు చేసి.. తక్కువ ఖర్చుతో నీటిని ఎత్తిపోసేందుకు అవకాశాలు ఉంటే పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అథారిటీ సూచనల మేరకు రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని, తాత్కాలికంగా తక్కువ ఖర్చుతో.. రింగ్‌బండ్‌ కాకుండా రాక్‌ ఫార్మేషన్‌ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని సూచించారు. గత ప్రభుత్వం చేసిన ఖర్చు వృథా పోకుండా.. ఏ మాత్రం అవకాశాలున్నా తాత్కాలిక ఏర్పాట్లు చేసి నీరివ్వాలన్నదే లక్ష్యం. ఈ నివేదికపై జియో ఫిజికల్, జియో టెక్నికల్‌ సిఫార్సులు తీసుకుని వేగంగా నిర్ణయాల అమలుకు మంత్రి ఉత్తమ్‌ ప్రయత్నిస్తున్నారు. 

 జూన్‌ 2న దశాబ్ది ఉత్సవాలు 

తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చి జూన్‌ 2కు పదేళ్లు అవుతుంది. ఈ ఉత్సవాలకు ఆమెను ఆహ్వానించి, సన్మానించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీర్మానం ప్రవేశపెట్టగా.. మంత్రిమండలి ఆమోదించింది. తెలంగాణ ఆశయాలను ప్రతిబింబించేలా కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ ప్రజాకార్యక్రమానికి తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిన వారందర్నీ ఆహ్వానిస్తాం. కార్యక్రమం నిర్వహణ కోసం అనుమతి కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని నిర్ణయించాం’’ అని మంత్రులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని