మాటలు రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్‌

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) వరంగల్‌ విద్యార్థులు ‘అమ్మ’ పేరిట యాప్‌ ఆవిష్కరించారు.

Published : 21 May 2024 06:08 IST

వరంగల్‌ నిట్‌ విద్యార్థుల రూపకల్పన
ఎంజీఎం డైక్‌ విభాగానికి అందజేత

డా.ప్రకాశ్‌కు యాప్‌ అంగీకారపత్రమిస్తున్న డా.కాదంబరి, సయ్యద్‌ ఫర్జానుద్దీన్, ఆదర్శరావు. చిత్రంలో డైక్‌ వైద్య సిబ్బంది

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) వరంగల్‌ విద్యార్థులు ‘అమ్మ’ పేరిట యాప్‌ ఆవిష్కరించారు. నిట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ హెడ్‌ డా.కె.వి.కాదంబరి ఆధ్వర్యంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులు ఆదర్శరావు, సయ్యద్‌ ఫర్జానుద్దీన్‌ దీన్ని రూపొందించారు. సోమవారం ఎంజీఎం ఆసుపత్రిలోని డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్వెన్షన్‌ సెంటర్‌ (డైక్‌)లో జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఇమ్యునైజేషన్‌ అధికారి (డీఐవో) డాక్టర్‌ ప్రకాశ్‌కు వారు యాప్‌ను అందిస్తున్నట్లు అంగీకారపత్రం ఇచ్చారు. నిత్యం ఇక్కడి డైక్‌ విభాగానికి 20 మంది వరకు స్పీచ్‌ థెరపీ కోసం వస్తుంటారు. డా.కె.వి.కాదంబరి మాట్లాడుతూ.. తొలిదశలో 50 పదాలతో ఆటల రూపంలో మాటలు మాట్లాడేలా.. మాటలు రాని, బుద్ధిమాంద్యం (ఆటిజం) గల 3-5 ఏళ్లలోపు పిల్లలకు ఉపయోగపడేలా దీన్ని తయారు చేసినట్లు చెప్పారు. ఉదాహరణకు యాప్‌లో ఆపిల్‌ బొమ్మను చూపిస్తూ పిల్లలతో పలికిస్తే.. వెల్‌డన్‌ అని సమాధానం వస్తుంది. ఈ విధంగా పిల్లలను ప్రోత్సహించేలా యాప్‌ ఉంటుందని, చిన్నారులకు త్వరగా మాటలు వచ్చేలా ఒక వ్యాయామంలా ఉపయోగపడనుందని తెలిపారు. త్వరలో దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉంచుతామన్నారు. మంగళవారం నుంచి యాప్‌ను లింక్‌ రూపంలో పిల్లల తల్లిదండ్రులకు పంపి డౌన్‌లోడ్‌ చేయించి అవగాహన కల్పిస్తామని డాక్టర్‌ ప్రకాశ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని