యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం

యాదాద్రిలో నృసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తివాచనం, సాయంత్రం అంకురార్పణ పర్వాలతో ఉత్సవాలకు పూజారులు, యాజ్ఞికులు శ్రీకారం చుట్టారు.

Updated : 21 May 2024 06:25 IST

యాదాద్రీశుడి జయంత్యుత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం విశ్వక్సేన ఆరాధన

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రిలో నృసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తివాచనం, సాయంత్రం అంకురార్పణ పర్వాలతో ఉత్సవాలకు పూజారులు, యాజ్ఞికులు శ్రీకారం చుట్టారు. పునర్నిర్మితమైన పంచనారసింహుల ఆలయంలో స్వామి వార్షిక జయంతి సంబరాలు జరగడం ఇది మూడోసారి. ఈ వేడుకల్లో యాదాద్రీశుడు తిరుమల వాసుడైన శ్రీవేంకటేశ్వరస్వామి రూపంలో ఉదయం గరుడ వాహనంపై...రాత్రివేళ పరవాసుదేవుడిగా దర్శనమిచ్చారు. ఆలయ మహాముఖ మండపంలో లక్ష కుంకుమార్చన కైంకర్యాన్ని వేద, మంత్ర పఠనాల మధ్య చేపట్టారు.  ఉత్సవ తొలిపూజలో ఆలయ ఈవో భాస్కర్‌రావు, ధర్మకర్త నరసింహమూర్తి పాల్గొన్నారు. అనుబంధంగా ఉన్న పాతగుట్టలోనూ స్వామి జయంతి వేడుకల్ని నిర్వహించారు. డీఈవో భాస్కరశర్మ, పేష్కార్‌ రమేశ్‌బాబు పాల్గొన్నారు.

సప్తగిరివాసుడి అలంకరణలో యాదాద్రీశుడు

వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా దర్శనాలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో దివ్యాంగులు, వృద్ధులకు నేరుగా, ఉచితంగా దైవదర్శనం చేసుకునే అవకాశాన్ని దేవస్థానం కల్పించింది. ఈ మేరకు ఆలయ ఈవో భాస్కర్‌రావు సోమవారం రాత్రి సంబంధిత విభాగానికి ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 7:30 నుంచి 8:30 గంటల వరకు, 10:00 నుంచి 11:00 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, రాత్రి 8:30 నుంచి 9 గంటల మధ్య కాలంలో తూర్పు గోపురం నుంచి నేరుగా ఆలయంలోకి అనుమతించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని