వర్సిటీలు.. అవినీతికి చిరునామాలు

సమాజానికి దిక్సూచిగా మారాల్సిన విశ్వవిద్యాలయాలు అక్రమాలు, అవినీతికి నిలయాలుగా మారాయి. ఆదర్శంగా ఉండాల్సిన ఉపకులపతు(వీసీ)లు కొందరు అక్రమార్జనే ధ్యేయంగా పాలన కొనసాగించారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.

Published : 21 May 2024 05:28 IST

అక్రమార్జనపైనే కొందరు వీసీల దృష్టి
మూడేళ్లలో దిగజారిన  విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠ

ఈనాడు, హైదరాబాద్‌: సమాజానికి దిక్సూచిగా మారాల్సిన విశ్వవిద్యాలయాలు అక్రమాలు, అవినీతికి నిలయాలుగా మారాయి. ఆదర్శంగా ఉండాల్సిన ఉపకులపతు(వీసీ)లు కొందరు అక్రమార్జనే ధ్యేయంగా పాలన కొనసాగించారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. వ్యక్తిత్వం, నిజాయతీ, నాయకత్వ లక్షణాలు చూడకుండా ప్రజాప్రతినిధుల పైరవీలు, సిఫారసులతో నియామకాలు చేపట్టడం.. వర్సిటీల్లో ఎన్నడూ లేనంత అవినీతికి కారణమైందని భావిస్తున్నారు. మొత్తానికి మూడేళ్లలో వర్సిటీల ప్రతిష్ఠ దిగజారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అప్పుడు ఏసీబీ.. ఇప్పుడు విజిలెన్స్‌

ఉన్నత విద్యాశాఖ పరిధిలో రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలున్నాయి. 2021 మే 21న వీసీలు నియమితులు కాగా మంగళవారంతో పదవీకాలం ముగుస్తోంది. ప్రధానంగా తెలంగాణ, జేఎన్‌టీయూహెచ్, కాకతీయ వర్సిటీల వీసీలపై పలు ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్‌ గత ఏడాది జూన్‌లో ఓ కాంట్రాక్టర్‌ నుంచి బిల్లు చెల్లింపు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక వీసీ అవినీతి నిరోధక శాఖకు దొరికిపోవడం అదే తొలిసారి. తాజాగా జగిత్యాల ప్రిన్సిపల్, వైస్‌ ప్రిన్సిపల్, సిరిసిల్ల కళాశాల ప్రిన్సిపల్‌ను బదిలీ చేశారు. కాకతీయ వీసీ రమేశ్‌ తొలగించిన అధ్యాపకులను నిబంధనలకు విరుద్ధంగా కొలువుల్లోకి తీసుకోవడం, అకడమిక్‌ నియామకాల్లో నిబంధనలను పాటించకపోవడం, అక్రమ బదిలీలు, నకిలీ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంపై ఆచార్యుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఓయూలో సీనియర్‌ ఆచార్యులకు పదోన్నతులిచ్చారన్న అంశంపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

కొత్త వీసీల నియామక ప్రక్రియ పూర్తికాకపోవడంతో ప్రస్తుతమున్న వారికే కొన్నాళ్లపాటు పదవీకాలం పొడిగిస్తారా? ఐఏఎస్‌ అధికారులకు లేదా ఉన్నత విద్యామండలి అధికారులకు ఇన్‌ఛార్జుల బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర కళాశాలలకు ఆయా వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉండటంతో ఇన్‌ఛార్జులైతే కొత్త సమస్యలు వస్తాయని, ఉన్న వారికే పదవీకాలం పొడిగించాలని కళాశాలల యజమానులుగా ఉన్న కొందరు రాజకీయ నేతలు కోరుతున్నట్లు సమాచారం. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ మంగళవారం స్పష్టత ఇస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు