ఖైదీల రక్షణ బాధ్యత అధికారులదే

కోర్టు తీర్పులతో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల రక్షణ బాధ్యత అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. హక్కుల ఉల్లంఘన జరిగినందున పరిహారం ప్రకటించే విచక్షణాధికారం కోర్టుకు ఉందని పేర్కొంది.

Published : 21 May 2024 05:32 IST

జైలులో మృతిచెందితే పరిహారం చెల్లించాల్సిందే: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: కోర్టు తీర్పులతో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల రక్షణ బాధ్యత అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. హక్కుల ఉల్లంఘన జరిగినందున పరిహారం ప్రకటించే విచక్షణాధికారం కోర్టుకు ఉందని పేర్కొంది. తన భర్త కరోళ్ల వెంకయ్య(55) 2012 జులై 4న చర్లపల్లి జైలులో తోటి ఖైదీ దాడిలో మృతి చెందారని.. రూ.10 లక్షల పరిహారం మంజూరు చేసేలా ఆదేశాలివ్వాలంటూ జయమ్మ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టి ఆమెకు రూ.7.20 లక్షల పరిహారాన్ని 6 శాతం వడ్డీతో చెల్లించాలంటూ ఇటీవల తీర్పు వెలువరించారు. సంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పుతో వెంకయ్య చర్లపల్లి జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తుండగా నిజామాబాద్‌ జిల్లా జైలు నుంచి దాసరి నరసింహులును అదే జైలుకు తరలించారు. జైలు అధికారుల వివరాల ప్రకారం దాసరి నరసింహులు క్షురకుని వద్ద విరిగిపోయిన కత్తెరను తస్కరించి తన బ్యారక్‌ పక్కన చెట్లలో దాచుకున్నాడు. 2012 జులై 4న తెల్లవారుజామున ఆ కత్తెరతో వెంకయ్యతోపాటు ఐదుగురు తోటి ఖైదీలపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. గాయపడినవారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా వెంకయ్య మృతి చెందారు. దీనిపై కుషాయిగూడ ఠాణాలో కేసు నమోదైంది. జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కూడా కేసు నమోదు చేసింది. మెజిస్టీరియల్‌ విచారణ జరిపి 2013 డిసెంబరు 19న కలెక్టర్‌ నివేదిక ఇవ్వడంతో రూ.లక్ష పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం 2018లో జయమ్మకు రూ.లక్ష అందజేశారు. దీనిపై హైకోర్టును జయమ్మ ఆశ్రయించారు. వాదనలను విన్న న్యాయమూర్తి రాజ్యాంగం కల్పించిన హక్కులను ఖైదీలకు నిరాకరించడానికి వీల్లేదన్నారు. ఖైదీ చనిపోయినప్పుడు పరిహారం లెక్కించడానికి సూత్రం ఏమీ లేనందున మోటారు వాహన ప్రమాద కేసుల్లో పరిహారం లెక్కింపునకు సంజయ్‌గుప్త వర్సెస్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేసులో పేర్కొన్న విధానమే ఇక్కడా అనుసరించాల్సి వస్తోందన్నారు. ఆ మేరకు మొత్తం రూ.7.20 లక్షలు చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని