ఇతర రాష్ట్రాల బార్‌ సభ్యులనూ అనుమతించాలన్న పిటిషన్‌లో నోటీసులు

తెలంగాణ పరిధిలో సివిల్‌ జడ్జి పోస్టులకు ఇతర రాష్ట్రాల బార్‌ సభ్యులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దిల్లీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడైన వి.రాకేష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ హృషికేశ్‌రాయ్, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రల ధర్మాసనం ఇటీవల విచారించింది.

Published : 21 May 2024 05:33 IST

సివిల్‌ జడ్జి పోస్టుకు పిటిషనర్‌ దరఖాస్తును తిరస్కరించరాదని సుప్రీంకోర్టు ఆదేశం

ఈనాడు, దిల్లీ: తెలంగాణ పరిధిలో సివిల్‌ జడ్జి పోస్టులకు ఇతర రాష్ట్రాల బార్‌ సభ్యులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దిల్లీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడైన వి.రాకేష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ హృషికేశ్‌రాయ్, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రల ధర్మాసనం ఇటీవల విచారించింది. తెలంగాణలో సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్‌ 10న ప్రకటన జారీ కావడంతో రాకేష్‌రెడ్డి దరఖాస్తు చేయడానికి ప్రయత్నించారు. అయితే స్థానిక బార్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు బార్‌ అసోసియేషన్‌ నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్న నిబంధన ఉండటంతో ఆయన దరఖాస్తు తీసుకోలేదు. దీన్ని సవాల్‌ చేస్తూ ఆయన తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు ఈ నెల 3న తీర్పునిచ్చింది. దాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. విచారించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. ఇదివరకే దాఖలైన ఎస్‌ఎల్‌పీ(సివిల్‌) నం.10419/2024కి ట్యాగ్‌ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఉద్యోగ నోటిఫికేషన్‌లోని నిబంధనలను అనుసరించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి పిటిషనర్‌కు అవకాశం ఇచ్చింది. తెలంగాణ స్టేట్‌ జ్యుడిషియల్‌ రూల్స్‌ 2023లోని నిబంధనల పేరుతో ఆ దరఖాస్తును తిరస్కరించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని