కొత్త రూపంలో తెలంగాణ రేషన్‌ కార్డులు?

ప్రస్తుతం ఉన్న రేషన్‌ (ఆహార భద్రత) కార్డుల రూపం మారనుంది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Updated : 22 May 2024 09:21 IST

ప్రభుత్వం కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతం ఉన్న రేషన్‌ (ఆహార భద్రత) కార్డుల రూపం మారనుంది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఈ కసరత్తు మొదలుకానున్నట్లు సమాచారం. ఆరోగ్యశ్రీ కార్డులతో గతంలో ఉన్న రూ.5 లక్షల చికిత్స పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 89,98,546 ఆహార భద్రత కార్డులున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్‌ కార్డు ఓ చిన్న పుస్తకం మాదిరి ఉండేది. అందులో కుటుంబ యజమాని ఫొటోతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు, వయసు వివరాలు ఉండేవి. ఆ తర్వాత వీటిస్థానంలో రైతుబంధు పాస్‌బుక్‌ సైజ్‌లో రేషన్‌కార్డులు జారీ అయ్యాయి. ముందువైపు కుటుంబ సభ్యుల గ్రూప్‌ ఫొటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు.. వెనుకవైపు చిరునామా, ఇతర వివరాలు ఉండేవి. ఆ తర్వాత రేషన్‌కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఒక పేజీతో ఒకవైపే ఉండే ఈ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫొటోల్లేకుండా.. కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్‌ దుకాణం, కార్డు సంఖ్య  మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొత్త కార్డు ఎలా ఉండాలనే విషయంపై ఎన్నికల కోడ్‌ ముగిశాక రాష్ట్ర ప్రభుత్వం చర్చించనున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని