సంక్షిప్త వార్తలు (4)

కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిరక్షణ చర్యల పర్యవేక్షణకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.

Updated : 22 May 2024 05:33 IST

బ్యారేజీల పరిరక్షణ చర్యల పర్యవేక్షణకు కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిరక్షణ చర్యల పర్యవేక్షణకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (జనరల్‌)ను కమిటీకి ఛైర్మన్‌గా నియమించింది. సభ్యులుగా ఈఎన్సీ (ఓ అండ్‌ ఎం), కమిషనర్‌ ఆఫ్‌ డిజైన్స్‌ సీఈ, రామగుండం సీఈలను నియమించారు. బ్యారేజీల రక్షణకు ఎన్డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికను అనుసరించి ప్రభుత్వం కమిటీకి బాధ్యతలను అప్పగించింది. 


37.59 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: రబీ సీజన్‌కు సంబంధించి మే 20 నాటికి 37.59 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల సంస్థ తెలిపింది. 7,245 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా 7,171 కేంద్రాలను ప్రారంభించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది రబీలో మే20వ తేదీ వరకు 33.97 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. 


చెరువుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు 

ఈనాడు, హైదరాబాద్‌: అర్బన్‌ ప్రాంతాల్లో చెరువులు, కుంటల పరిరక్షణ పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. చెరువుల పునరుద్ధరణ, పరిరక్షణ చర్యలపై పురపాలక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక్క రోజు కార్యశాలలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పురపాలక శాఖ డైరెక్టర్‌ దివ్య దీనికి అధ్యక్షత వహించారు. జలవనరుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ వివరించారు.


నాణ్యతతోనే పంట ఉత్పత్తులకు మంచి ధరలు
మార్కెటింగ్‌  సంచాలకురాలు లక్ష్మీబాయి

ఈనాడు, హైదరాబాద్‌ : వ్యవసాయ ఉత్పత్తుల్లో నాణ్యత, వైవిధ్యం, స్వచ్ఛతలకు ప్రాధాన్యమిస్తే మార్కెటింగ్‌  సమస్య ఉండదని రాష్ట్ర మార్కెటింగ్‌  సంచాలకురాలు లక్ష్మీబాయి తెలిపారు. రాజేంద్రనగర్‌ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ విద్యాసంస్థలో అమ్మకం, కొనుగోలుదారుల సదస్సుకు మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మార్కెటింగ్‌  శాఖపరంగా రైతులకు అవసరమైన సేవలందిస్తున్నామని, వాటిని వినియోగించుకోవాలన్నారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకురావాలని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. పరిస్థితులకు అనుగుణంగా సరైన సమయంలో పంటలను విక్రయించాలని, అవసరమయితే వాటిని నిల్వ చేసుకోవాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌  రఘురామిరెడ్డి మాట్లాడుతూ..రైతులకు పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌  సవాలుగా మారిందని, పరిశ్రమల్లో అధిక ఉత్పత్తి చేస్తే బోనస్‌ లభిస్తుందని, కానీ వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తి కారణంగా నష్టాలు రావడం దురదృష్టకరమని తెలిపారు. త్వరగా పాడైపోయే పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌  సమస్యను రైతులు అధిగమించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని