ఎంజీఎంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం సుమారు అయిదు గంటలపాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది.

Updated : 22 May 2024 05:34 IST

అయిదు గంటలపాటు రోగులకు ఇబ్బందులు

వార్డులో కరెంటు లేకపోవడంతో సెలైన్‌తో సహా వరండాలో మహిళా రోగి

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం సుమారు అయిదు గంటలపాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. దీంతో ఆసుపత్రిలోని అత్యవసర వైద్యవిభాగం ఏఎంసీ, ఆర్‌ఐసీయూ, నవజాత శిశువుల వార్డుల్లో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న రోగులు, చిన్నారులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రిలో నాలుగు జనరేటర్లు ఉండగా.. అందులో ఒకటి మాత్రమే పనిచేస్తోంది. దీంతో కరెంటు పోతే ఒక్క జనరేటర్‌తో ఆసుపత్రి మొత్తానికి విద్యుత్తు సరఫరా సాధ్యం కావడం లేదు. హుటాహుటిన ఒక జనరేటర్‌కు మరమ్మతు చేయించారు. దీంతో ఐసీయూ రోగులకు ప్రాణాపాయం తప్పింది. ఆసుపత్రిలోని నర్సింగ్‌ స్కూల్‌ వసతిగృహం వెనక ఉన్న విద్యుత్తు స్తంభంపై తీగలకు పతంగి దారం తగలడంతో సరఫరాకు అంతరాయం కలిగిందని మొదట దానికి మరమ్మతులు చేసినా సరఫరా పునరుద్ధరణ కాలేదు. తర్వాత సబ్‌స్టేషన్‌ నుంచి ఆసుపత్రిలో వచ్చే విద్యుత్తు సరఫరా దగ్గరే లోపం ఉన్నట్లు గుర్తించి గంటల తరబడి మరమ్మతు చేశారు. సాయంత్రం 4.30 గంటలకు నిలిచిపోయిన సరఫరా రాత్రి 9.30 గంటలకు పునరుద్ధరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని