మూడు నెలల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయండి

మత్స్యకార సంఘాల్లో సభ్యత్వానికి కొన్ని తెగలను పరిగణనలోకి తీసుకోకపోవడం, మరికొన్నింటిని తాజాగా చేర్చడం తదితర వివాదాల పరిష్కారానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

Published : 22 May 2024 04:42 IST

మత్స్యకారుల వివాదాలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: మత్స్యకార సంఘాల్లో సభ్యత్వానికి కొన్ని తెగలను పరిగణనలోకి తీసుకోకపోవడం, మరికొన్నింటిని తాజాగా చేర్చడం తదితర వివాదాల పరిష్కారానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ మూడు నెలల్లో చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. బెస్త, బోయి, గంగపుత్ర, గూండ్ల తెగల వారిది చేపలు పట్టే వృత్తిగా పరిగణనలోకి తీసుకోకపోవడంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, లేదా ఈ అంశాన్ని బీసీ కమిషన్‌కు సిఫారసు చేయాలంటూ హైకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. బెస్త, బోయి, గూండ్ల, గంగపుత్రలతో కూడిన మత్స్యకార సహకార సంఘాల్లో సభ్యత్వం ఇవ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ ముదిరాజ్, ముతరాసి, తెనుగు తెగలవారు మరికొన్ని పిటిషన్లు దాఖలు చేశారు. సహకార సంఘాల్లో సభ్యత్వం ఇచ్చేందుకు నైపుణ్య పరీక్ష నిర్వహించడానికి జిల్లా మత్స్యశాఖ అధికారులు జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. మత్స్యకారుల మధ్య వివాదాలపై 2017 నుంచి దాఖలైన 26 పిటిషన్లపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ఇటీవల విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. మూడు నెలల్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ పశుసంవర్ధక. బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని