ఆ ఫైనాన్స్‌ సంస్థతో టెస్కాబ్‌కు సంబంధం లేదు

శ్రీప్రియాంక ఫైనాన్స్‌ సంస్థతో కానీ, దాని ఖాతాదారులతో కానీ తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్‌ (టెస్కాబ్‌)కు ఎలాంటి సంబంధం లేదని బ్యాంక్‌ ఎండీ మురళీధర్‌ తెలిపారు.

Published : 22 May 2024 04:43 IST

రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్‌లో డిపాజిట్లన్నీ భద్రం
ఎండీ మురళీధర్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీప్రియాంక ఫైనాన్స్‌ సంస్థతో కానీ, దాని ఖాతాదారులతో కానీ తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్‌ (టెస్కాబ్‌)కు ఎలాంటి సంబంధం లేదని బ్యాంక్‌ ఎండీ మురళీధర్‌ తెలిపారు. టెస్కాబ్‌లో ఖాతాదారుల డిపాజిట్లు భద్రంగా ఉన్నాయని మంగళవారం స్పష్టం చేశారు. సంస్థ జనరల్‌ మేనేజర్‌ నిమ్మగడ్డ వాణీబాల వ్యక్తిగత హోదాలో మోసానికి పాల్పడ్డారని వెల్లడించారు. శ్రీప్రియాంక ఫైనాన్స్‌ సంస్థను మేక నేతాజీ అనే వ్యక్తి నిర్వహిస్తుండగా, ఆయన భార్య వాణీబాల టెస్కాబ్‌లో 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆప్కాబ్, టెస్కాబ్‌లకు చెందిన అధికారులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారు, వారి బంధుమిత్రులు అధిక వడ్డీలు వస్తాయనే ఆశతో ప్రియాంక సంస్థలో పెట్టుబడులు పెట్టారని, దానికి టెస్కాబ్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. టెస్కాబ్‌ ఉద్యోగులు, సిబ్బంది ద్వారా అందిన ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే వాణీబాలను సస్పెండ్‌ చేశామని, ఆమెకు చెల్లించాల్సిన పదవీ విరమణ భత్యాలను నిలిపివేశామని, ఆమెపై విచారణకు ఆదేశించామని తెలిపారు.  

కష్టాల్లో ఉన్నా.. పదవీ విరమణ భత్యాలు ఇవ్వండి..: వాణీబాల 

తన సెలవును ఆమోదించి, పదవీవిరమణ భత్యాలు (బెనిఫిట్స్‌) ఇవ్వాలని కోరుతూ సస్పెండైన టెస్కాబ్‌ జీఎం (మానవ వనరుల విభాగం) వాణీబాల సంస్థ ఎండీ మురళీధర్‌కు మంగళవారం లేఖ రాశారు. ఆమెను సస్పెండ్‌ చేస్తూ..  పదవీవిరమణ భత్యాలు నిలిపివేసి, విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆమె ఎండీకి పోస్టు ద్వారా లేఖ పంపారు. అందులో ఆమె చిరునామా పేర్కొనలేదు. హైదరాబాద్‌ న్యూసైదాబాద్‌ కాలనీలో నివసించే ఆమె 15 రోజుల క్రితం ఇంటికి తాళం వేసివెళ్లారు. తాను కష్టాల్లో ఉన్నానని, తనకు రావాల్సిన డబ్బులను తన కుమారుడు శ్రీహర్షకు చెల్లించాలని కోరారు. నెలకు రూ.2.50 లక్షల వేతనంతో పనిచేస్తున్న ఆమెకు రూ.కోటి వరకు పదవీ విరమణ భత్యాలు అందాల్సి ఉందని తెలిసింది. ఆమె లేఖ రాసిన విషయాన్ని టెస్కాబ్‌ అధికారులు పోలీసులకు తెలిపారు. టెస్కాబ్‌లో పనిచేస్తున్న అధికారులు 95 శాతం మంది.. వాణీబాలను నమ్మి ప్రియాంక ఫైనాన్స్‌లో డిపాజిట్‌ చేసినట్లు తెలిసింది.


వాణీబాల వ్యవహారం, ఆమెపై సస్పెన్షన్‌ వేటు, విచారణకు సంబంధించిన అంశాలపై సహకార శాఖ ముఖ్యకార్యదర్శికి టెస్కాబ్‌ ఎండీ మురళీధర్‌ మంగళవారం నివేదికలు పంపించారు. నాబార్డు, రిజర్వ్‌ బ్యాంక్‌కు సైతం సమాచారం ఇచ్చారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని