రైస్‌మిల్లు వద్ద 5 రోజులుగా పడిగాపులు

రోజుల తరబడి రైస్‌మిల్లుల్లో ధాన్యం దించకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నామని, తగిన న్యాయం చేయాలంటూ రైతులు, కేంద్రాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 22 May 2024 05:35 IST

అయిదు లారీలతో అన్‌లోడింగ్‌కు ఎదురుచూపులు
‘ఎక్స్‌’ వేదికగా హరీశ్‌రావు విమర్శలు

మిల్లు వద్ద ఉన్న ధాన్యం లారీ

సిద్దిపేట, న్యూస్‌టుడే: రోజుల తరబడి రైస్‌మిల్లుల్లో ధాన్యం దించకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నామని, తగిన న్యాయం చేయాలంటూ రైతులు, కేంద్రాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పందించిన మాజీ మంత్రి హరీశ్‌రావు వారికి మద్దతుగా నిలిచారు. చేగుంట మండలం పులిమామిడి, ఇబ్రహీంపూర్‌ గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి అయిదు రోజుల క్రితం 5 లారీల ధాన్యాన్ని బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌ శివారులోని అన్నపూర్ణ రైస్‌మిల్లుకు తరలించారు. అప్పటి నుంచి అన్‌లోడ్‌ చేయలేదు. దీంతో ఇబ్రహీంపూర్‌ సొసైటీ సీఈవో, పులిమామిడి కేంద్రం పీఏసీఎస్‌ ఇన్‌ఛార్జి సంతోష్‌ సహా సిబ్బంది శ్రీకాంత్, అనిల్‌తో కలిసి సోమవారం మిల్లు నిర్వాహకులను కలిశారు. కొనుగోలు చేయాలని విన్నవించగా.. వర్షాలతో ధాన్యం తడిసిందని, తేమ శాతం ఎక్కువగా ఉందని, బియ్యం పట్టేందుకు ఈ ధాన్యం పనికి రాదని సమాధానం ఇచ్చారు. లారీకి 50 సంచుల (దాదాపు 20 క్వింటాళ్ల) చొప్పున తరుగు పేరిట కోత విధించి అన్‌లోడ్‌ చేసుకుంటామని మిల్లు నిర్వాహకులు వెల్లడించినట్లు తెలిపారు. బతిమిలాడినా, నిర్వాహకుల కాళ్లపై పడి వేడుకున్నా స్పందించలేదని సంతోష్‌ ఆరోపించారు. దీంతో రైతులు మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఫోన్లో విన్నవించగా ఆయన ఎక్స్‌ వేదికగా మంగళవారం స్పందించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకు నిదర్శనమే ఈ సంఘటన అని పేర్కొన్నారు. సమస్య పరిష్కరించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని