ఇంటర్‌ విద్యార్థులతో ఈసారీ చెలగాటమే!.. మూడో వంతు కళాశాలలకే ‘అనుబంధ గుర్తింపు’

ఇంటర్‌ బోర్డు చెప్పేది ఒకటి... చేసేది మరొకటిలా ఉంది పరిస్థితి. గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను హెచ్చరిస్తున్న బోర్డు.. సకాలంలో కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వవడం లేదు.

Updated : 23 May 2024 07:37 IST

మూడో వంతు కళాశాలలకే ఇప్పటికి ‘అనుబంధ గుర్తింపు’ జారీ
వాణిజ్య, గృహ సముదాయాల్లో 427 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ బోర్డు చెప్పేది ఒకటి... చేసేది మరొకటిలా ఉంది పరిస్థితి. గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను హెచ్చరిస్తున్న బోర్డు.. సకాలంలో కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వవడం లేదు. గృహ, వాణిజ్య సముదాయాల్లో (మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ) కొనసాగుతున్న కళాశాలలకు అనుమతుల విషయంలోనూ తాత్సారం చేస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయా కళాశాలలు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌ఓసీ) తీసుకుని బోర్డుకు సమర్పిస్తేనే అనుమతి ఇవ్వాలి. వివిధ కారణాలతో గత నాలుగేళ్లుగా ఇందుకు మినహాయింపు ఇచ్చారు. రానున్న విద్యాసంవత్సరానికి ఏమి చేస్తారనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 

  • ప్రతి విద్యా సంవత్సరం ప్రవేశాలు చేపట్టేముందు.. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలన్నీ ఇంటర్‌బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్‌) పొందటం తప్పనిసరి. జూన్‌ 1 నుంచి ప్రారంభమయ్యే 2024-25 విద్యా సంవత్సరానికి ఈ నెల 9 నుంచి ప్రవేశాలను ప్రారంభించుకోవచ్చని బోర్డు కాలపట్టిక జారీచేసింది. అయితే రాష్ట్రంలోని 1443 ప్రైవేట్‌ కళాశాలలకు గానూ 412కే ఈ నెల 22 నాటికి అనుబంధ గుర్తింపు దక్కింది. అంటే మూడోవంతు కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ కలిపి 3,269 జూనియర్‌ కళాశాలలు ఉండగా.. 2,132కే అనుమతులు ఇచ్చారు. 
  • మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీలోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలలకు అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ తప్పనిసరి చేస్తూ.. 2020 సెప్టెంబరు 24న హోం శాఖ జీఓ జారీచేసింది. అలాంటి కళాశాలలు రాష్ట్రవ్యాప్తంగా 427 ఉండగా.. అత్యధికం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి. పక్కా భవనాలు లేని కళాశాలలు మరో తొమ్మిది ఉన్నాయి. ఇవన్నీ అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటిస్తున్నట్లు ఆ శాఖ జారీ చేసే ఎన్‌ఓసీ సమర్పిస్తేనే ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్‌) జారీచేస్తుంది. అప్పుడు మాత్రమే ఆ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి వీలవుతుంది. లేకుంటే వాటికి బోర్డు వెబ్‌సైట్‌ లాగిన్‌ ఓపెన్‌ కాదు. కరోనా పరిస్థితుల వల్ల 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు ప్రభుత్వం వాటికి ‘ఎన్‌వోసీ’ నుంచి మినహాయింపు ఇచ్చింది. తర్వాత కళాశాల యాజమాన్యాల సంఘం విన్నపం మేరకు.. 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకూ మినహాయింపును కొనసాగించింది. ఈ క్రమంలో గత విద్యా సంవత్సరం మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలు పొందిన విద్యార్థుల నుంచి.. ఇష్టపూర్వకంగానే చేరుతున్నట్లు హామీపత్రాలు తీసుకున్నారు. ప్రస్తుతం వారు రెండో ఏడాదికి వచ్చారు. తాజా విద్యా సంవత్సరానికి అనుమతులు ఇవ్వకుంటే ఆయా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. ప్రస్తుతం ఆయా కళాశాలల్లో మొదటి సంవత్సరంలో చేరుతున్న వారిదీ అదే పరిస్థితి. ఈసారికి కూడా మినహాయింపు పొందాలని యాజమాన్యాలు ఓ మంత్రి ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని వాటికి అనుమతులు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, రాష్ట్రంలో ఏటా ఏదో ఒక సాకుతో మినహాయింపు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కనీసం ఏ కళాశాలలు.. మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ కింద ఉన్నాయన్న వివరాలను కూడా ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్లో ఉంచటం లేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని