రైల్వే కోల్‌ కారిడార్‌కు గ్రీన్‌ సిగ్నల్‌!

సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాలను కలుపుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక ‘రైల్వే బొగ్గు రవాణా నడవా’ (రైల్వే కోల్‌ కారిడార్‌) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Published : 23 May 2024 03:18 IST

రామగుండం నుంచి మణుగూరు వరకు నిర్మాణం

ఈనాడు- హైదరాబాద్, పెద్దపల్లి: సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాలను కలుపుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక ‘రైల్వే బొగ్గు రవాణా నడవా’ (రైల్వే కోల్‌ కారిడార్‌) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రంలో 207.80 కి.మీ. మేర ఈ నడవా విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్‌గేజ్‌ నిర్మించాలని.. అందుకు తక్షణమే పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భూసేకరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులకు రైల్వే మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు మంగళవారం అర్ధరాత్రి వెలువడ్డాయి. 

అంచనా వ్యయం రూ.2,911 కోట్లు

మణుగూరు-రామగుండం ప్రాజెక్టు  ప్రాథమిక పనులకు కేంద్రం 2013-14 బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించింది. అయితే అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, ఆ తర్వాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు భరించేందుకు ఆసక్తి చూపకపోవడంతో ముందడుగు పడలేదని సమాచారం. సరకు రవాణాకు మంచి మార్గం కావడం, ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందన్న అంచనాతో ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని భరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నిర్ణయానికి ప్రధాని కార్యాలయం గత ఏడాది ఆమోదం తెలిపింది. 2013-14లో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,112 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.2,911 కోట్లకు పెరిగింది. 

తగ్గనున్న బొగ్గు రవాణా వ్యయం

రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఉన్న 26 భూగర్భ, 20 ఉపరితల గనుల ద్వారా ఏటా 65 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. సింగరేణి ఏటా రూ.వందల కోట్లను కేవలం బొగ్గు రవాణాకే వెచ్చిస్తోంది. ప్రస్తుతం బల్లార్షా నుంచి ఖమ్మం ప్రాంతానికి హనుమకొండ జిల్లా కాజీపేట మీదుగా 349 కి.మీ. రైల్వే మార్గం ఉంది. రామగుండం-మణుగూరు   లైను నిర్మిస్తే దాదాపు 142 కి.మీ. దూరం తగ్గడమే కాకుండా బొగ్గ్గు రవాణా వ్యయం తగ్గుతుంది. ఈ రైలు మార్గంతో కాళేశ్వరం, రామప్ప, మేడారం, కోటగుళ్లు, మంథని వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు.. లక్నవరం చెరువు, బొగత జలపాతం వంటి జలపర్యాటక ప్రదేశాలు అనుసంధానమవుతాయి. 

పాతికేళ్ల తర్వాత కొలిక్కి..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్‌ నుంచి మంథని, భూపాలపల్లి, ములుగు మీదుగా మణుగూరు వరకు   రైల్వే లైన్‌ నిర్మాణం కోసం   పాతికేళ్ల క్రితం 1999లోనే అడుగు పడింది. ప్రస్తుతం భూసేకరణ కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ    చేయడంతో వారం రోజుల్లో రైల్వే ఇంజినీరింగ్‌ విభాగం సర్వే చేపట్టి   సాధ్యాసాధ్యాలను రైల్వేశాఖకు నివేదిస్తుంది. అనంతరం భూసేకరణ సర్వే చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు