ఆ విషయాన్ని జీర్ణించుకోలేక.. గగనతలంలో విమానం తలుపుతీసే యత్నం

గగనతలంలో ప్రయాణిస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు హంగామా చేశాడు. విమానం తలుపులను బలవంతంగా తెరవడానికి యత్నించాడు. దీంతో ప్రయాణికులందరూ భయభ్రాంతులకు గురయ్యారు.

Updated : 23 May 2024 05:38 IST

ప్రయాణికుడి అరెస్టు

శంషాబాద్, న్యూస్‌టుడే: గగనతలంలో ప్రయాణిస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు హంగామా చేశాడు. విమానం తలుపులను బలవంతంగా తెరవడానికి యత్నించాడు. దీంతో ప్రయాణికులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న భద్రతాధికారులు ఆయనను అరెస్టు చేశారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్‌ విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నగరంలోని గాజులరామారానికి చెందిన అనిల్‌(35) ఓ వ్యాయామశాలలో శిక్షకుడు(జిమ్‌ ట్రైనర్‌). దైవదర్శనం కోసం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో విమానంలో బయలుదేరాడు. విమానం గగనతలంలో ప్రయాణిస్తుండగా తోటి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించాడు. గమనించిన ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది అతడిని మందలించి క్యాబిన్‌ వద్ద ముందు సీట్లో కూర్చోబెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని అనిల్‌ విమానం తలుపులను తీయడానికి ప్రయత్నించాడు. ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది కలిసి అడ్డుకున్నారు. శంషాబాద్‌లో విమానం దిగగానే అతడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. అనిల్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని