మన అణు సామర్థ్యం.. మన స్వార్జితం

మన అణు సామర్థ్యం మన స్వార్జితమని అటామిక్‌ ఎనర్జీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.చిదంబరం అన్నారు. భారత్‌ మాత్రమే వేరే దేశాల సాయం లేకుండా సొంతంగా దీనికి సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేసిందని వివరించారు.

Updated : 23 May 2024 04:56 IST

ఆంక్షలని భయపెట్టారు.. అయినా ముందడుగు వేసిన నాటి ప్రభుత్వం
అటామిక్‌ ఎనర్జీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.చిదంబరం

అటామిక్‌ ఎనర్జీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.చిదంబరానికి జ్ఞాపికను బహూకరిస్తున్న ‘నాసి’ లోకల్‌ చాప్టర్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ మోహన్‌రావు, చిత్రంలో ‘టాస్‌’ కోశాధికారి ఆచార్య ఎస్‌.ఎం.రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్‌.సత్యనారాయణ, ఎన్‌ఎఫ్‌సీ ఛైర్మన్‌ కోమల్‌ కపూర్‌

ఈనాడు, హైదరాబాద్‌: మన అణు సామర్థ్యం మన స్వార్జితమని అటామిక్‌ ఎనర్జీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.చిదంబరం అన్నారు. భారత్‌ మాత్రమే వేరే దేశాల సాయం లేకుండా సొంతంగా దీనికి సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేసిందని వివరించారు. ఇప్పుడు మనం ఎలాంటి అణ్వస్త్రాలైనా తయారు చేసుకునే స్థాయికి చేరుకున్నామని అన్నారు. ‘స్మైలింగ్‌ బుద్ధ’ పేరుతో భారత్‌ అణు పరీక్షలు చేపట్టి 50 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా బుధవారం నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఇండియా(నాసి), తెలంగాణ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌(టాస్‌) సంయుక్తంగా హైదరాబాద్‌లోని ఐఐసీటీ ఆడిటోరియంలో ‘మే 1947 టెస్ట్‌ అండ్‌ బియాండ్‌’ పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.  భారత్‌ చేపట్టిన రెండు అణ్వస్త్ర పరీక్షల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. 1974లో జరిగిన మొదటి పరీక్షను శాంతియుతమైనదిగా ఆయన అభివర్ణించారు. 1998లో పోఖ్రాన్‌లో ఆపరేషన్‌ శక్తి పేరుతో చేసిన పరీక్షలను అణ్వస్త్ర పరీక్షలుగా తొలిసారి ప్రకటించినట్లు చెప్పారు. పరీక్షలు చేస్తే భారత్‌పై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తాయని అప్పట్లో చాలామంది భయపెట్టారని.. పరీక్షలు జరిగిన తర్వాతనే భారత విదేశీ మారక నిల్వల పెరుగుదల కొనసాగిందని, భారత్‌ సాంకేతిక సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని.. ఫలితంగా హైటెక్‌ ఎగుమతులు పెరిగాయని వివరించారు.

మూడో పరీక్ష అవసరం ఉండకపోవచ్చు 

పోఖ్రాన్‌-3 పరీక్ష అవసరమా అని అడగగా..  రెండో పరీక్షలో అత్యధికంగా 45 కిలోటన్నుల శక్తిని వెలువరించిన థర్మో న్యూక్లియర్‌ బాంబును పరీక్షించామని, వాస్తవానికి 200 కిలో టన్నుల సామర్థ్యం కల్గిన బాంబును రూపొందించే సత్తా భారత్‌కు ఉందని డాక్టర్‌ చిదంబరం తెలిపారు. మూడో పరీక్ష అవసరం ఉండకపోవచ్చని నర్మగర్భంగా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అణు విద్యుత్తు అంశంపై ఆందోళనలను ఆయన కొట్టిపడేశారు. అణు విద్యుత్తు శుద్ధమైందని, అది చాలా అవసరమని అన్నారు. ‘కారు ప్రమాదాలు జరిగాయని అందులో ప్రయాణించకుండా ఉంటామా.. ఇది కూడా అంతే’ అన్నారు. సమావేశంలో ‘నాసి’ లోకల్‌ చాప్టర్‌ ఛైర్మన్, సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌ మోహన్‌రావు, ఎన్‌ఎఫ్‌సీ ఛైర్మన్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డాక్టర్‌ కోమల్‌ కపూర్, ‘టాస్‌’ ప్రధాన కార్యదర్శి, ఓయూ మాజీ ఉపకులపతి ఎస్‌.సత్యనారాయణ, కోశాధికారి ఆచార్య ఎస్‌.ఎం.రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని