అడ్వొకేట్‌ కమిషనర్లు పబ్లిక్‌ సర్వెంట్‌లే

కోర్టు నియమించిన అడ్వొకేట్‌ కమిషనర్లు పబ్లిక్‌ సర్వెంట్‌ల పరిధిలోకే వస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం విధులు నిర్వహిస్తున్న వారిని అడ్డుకున్న సీఐపై మేజిస్ట్రేట్‌ కోర్టు కేసు నమోదు చేయడం సబబేనని పేర్కొంది.

Updated : 23 May 2024 04:50 IST

వారి విధులను అడ్డుకున్న సీఐపై కేసు నమోదు సబబే: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: కోర్టు నియమించిన అడ్వొకేట్‌ కమిషనర్లు పబ్లిక్‌ సర్వెంట్‌ల పరిధిలోకే వస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం విధులు నిర్వహిస్తున్న వారిని అడ్డుకున్న సీఐపై మేజిస్ట్రేట్‌ కోర్టు కేసు నమోదు చేయడం సబబేనని పేర్కొంది. 2012 నాటి పిటిషన్‌పై.. న్యాయమూర్తి జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించారు. వివరాలివీ..

2012 డిసెంబరు 21న కాకతీయ ఉత్సవాల ప్రారంభానికి వస్తున్న సీఎం కాన్వాయ్‌పై రాళ్లు విసరాలనే కుట్రతో సమావేశమైన పలువురు తెరాస (ఇప్పటి భారాస) మద్దతుదారులు, ఇతరులను హనుమకొండ సుబేదారి పోలీసుస్టేషన్‌ సీఐ వి.సురేష్‌ అదుపులోకి తీసుకున్నారు. వారిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని, అడ్వొకేట్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసి తనిఖీకి వారెంట్‌ జారీచేయాలని అబ్దుల్‌నబి అనే న్యాయవాది సీజేఎంను ఆశ్రయించారు. దీంతో న్యాయవాదులు కె.రమేశ్, ఎం.రవీందర్‌లను అడ్వొకేట్‌ కమిషనర్లుగా సీజేఎం ఏర్పాటు చేసింది. పోలీసుస్టేషన్‌లో పరిశీలించి, నిందితులు ఉంటే కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. అదే రోజు రాత్రి అడ్వొకేట్‌ కమిషనర్లు.. పోలీసుస్టేషన్‌కు వెళ్లి, అక్కడ నలుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించారు. అయితే వారి విధులకు సీఐ వి.సురేష్‌తోపాటు పోలీసులు అడ్డుతగిలి స్టేషన్‌ వదిలి వెళ్లాలన్నారు. ఈ క్రమంలో సీఐపై సీజేఎం సుమోటోగా కేసు తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కేసును కోర్టు రికార్డుల్లోకి (కాగ్నిజెన్స్‌) తీసుకోవాలంటే సీఆర్‌పీసీ సెక్షన్‌ 197 ప్రకారం ప్రభుత్వ అనుమతి అవసరమని పేర్కొన్నారు. వాదనలను విన్న జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ తీర్పు వెలువరిస్తూ.. సీఆర్‌పీసీ సెక్షన్‌ 197(1) ప్రకారం ప్రభుత్వ అనుమతికి మినహాయింపులుంటాయని స్పష్టం చేశారు. కోర్టు విచారణ కాగ్నిజెన్స్‌తో ప్రారంభమవుతుందని, ప్రభుత్వ అనుమతి అవసరంలేదన్నారు. ఐపీసీ సెక్షన్‌ 21 ప్రకారం అడ్వొకేట్‌ కమిషన్‌ కోర్టు ఆదేశాలతో విధులు నిర్వహిస్తున్నారని, వారు పబ్లిక్‌ సర్వెంట్‌ల పరిధిలోకి వస్తారన్నారు. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి కారణాల్లేవంటూ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని