విత్తనమేళా రేపు

వానాకాలం సీజన్‌ సందర్భంగా రైతులను నకిలీ విత్తనాలపై అప్రమత్తం చేసి, మేలైన వంగడాలు అందించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది.

Updated : 23 May 2024 04:49 IST

వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిశోధన కేంద్రాలు, కేవీకేల్లో నిర్వహణ
మేలైన వంగడాలపై అన్నదాతలకు అవగాహన

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలం సీజన్‌ సందర్భంగా రైతులను నకిలీ విత్తనాలపై అప్రమత్తం చేసి, మేలైన వంగడాలు అందించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 24న రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో, జగిత్యాల, పాలెం, వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, 16 కృషి విజ్ఞాన కేంద్రా(కేవీకే)ల్లో విత్తన మేళాలను నిర్వహించనుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మేళా శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. వ్యవసాయ పరిశోధనా మండలి సంస్థలు ఐఐఎంఆర్, ఐఐఓఆర్, ఐఐఆర్‌ఆర్‌లతోపాటు వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య శాఖలు ఇందులో పాల్గొననున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగే విత్తనమేళాల్లో 16 పంటల్లో 67 రకాలకు సంబంధించి దాదాపు 12 వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు విక్రయించేందుకు అందుబాటులో ఉంచనున్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతపై రైతుల సందేహాలు తీర్చటానికి ఆయా పంటల ప్రధాన శాస్త్రవేత్తలతో చర్చాగోష్ఠి ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శన సైతం నిర్వహిస్తున్నామని వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు రఘురామిరెడ్డి తెలిపారు.


మేలైన వంగడాలివే...

వ్యవసాయ వర్సిటీలో రూపొందించిన వివిధ వంగడాల్లో వరిలో సన్నగింజ రకాలు(19 రకాలు) బీపీటీ-5204, డబ్ల్యూజీఎల్‌ -44, 962, 1119, 1246, 1487, ఆర్‌డీఆర్‌-1162, 1200, కేఎన్‌ఎం-1638, కేపీఎస్‌-6251, జేజీఎల్‌- 28545, 27356, 33124, ఆర్‌ఎన్‌ఆర్‌-15435, 2465, 11718, 21278, 29325, 15048 అందుబాటులోఉంటాయి. దొడ్డు గింజ రకాలైన ఆర్‌.ఎన్‌.ఆర్‌ 28361, 15459, కేఎన్‌ఎం 118, ఎంటీయూ 1010, డబ్ల్యూజీఎల్‌ 915, జేజీఎల్‌ 24423, 28639; సువాసన కలిగిన రకం ఆర్‌.ఎన్‌.ఆర్‌ 2465; మొక్కజొన్నలో హైబ్రిడ్‌ రకాలైన డీహెచ్‌ఎం 117, 121, బీపీసీహెచ్‌-6, కరీంనగర్‌ మక్క, కరీంనగర్‌ మక్క-1; జొన్నలో పీవైపీఎస్‌-2, సీఎస్‌వీ-41; రాగిలో పీఆర్‌ఎస్‌-38; ఆముదంలో పీసీహెచ్‌-111; నువ్వులు జేజీఎస్‌-1020; వేరుసెనగలో ధరణి, పెసరలో డబ్ల్యూజీజీ-42, ఎంజీజీ-295, 347, 385; మినుముల్లో ఎంబీజీ-1070; కందిలో హనుమ, డబ్ల్యూఆర్‌జీఈ- 97, 93, 121, 255 తదితర పంటల విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని