రిటైరై వెళుతూ.. సంప్రదాయాలకు భిన్నంగా నిర్ణయాలు

జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి తన పదవీకాలం ముగిసే ముందు చివరి రెండు రోజులు సంప్రదాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు.

Published : 24 May 2024 04:23 IST

పదవీకాలం ముగిసిన రోజు జేఎన్‌టీయూలో వేతనాలు పెంచుతూ వీసీ కట్టా ఉత్తర్వులు

కట్టా నర్సింహారెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి తన పదవీకాలం ముగిసే ముందు చివరి రెండు రోజులు సంప్రదాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన పదవీకాలం ముగిసిన ఈ నెల 22వ తేదీన ఏకంగా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు కాంట్రాక్టు అధ్యాపకుల జీతాలను 2021, 2022లోనే పెంచగా... జేఎన్‌టీయూహెచ్‌లో మాత్రం మూడేళ్లు దాని జోలికి వెళ్లని ఆయన... పదవీ కాలం ముగిసిన రోజు ఎన్నికల కోడ్‌ ఉన్నా ఉత్తర్వులివ్వడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు వేతనాలను నిర్ణయిస్తూ 2018లో జీవో 11 జారీ అయింది. మళ్లీ 2021 సెప్టెంబరు 1న జీవో 141 వచ్చింది. మూల వేతనంతోపాటు ఏటా వారికి ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. ఆ ప్రకారం విద్యాశాఖ పరిధిలోని అన్ని వర్సిటీలు 2021-22, 2022-23 విద్యా సంవత్సరంలోనే కొత్త వేతనాలను అమలు చేశాయి. జేఎన్‌టీయూహెచ్‌లో మాత్రం అమలుకాలేదు.

మూడేళ్లుగా మొరపెట్టుకుంటూనే ఉన్నా...

ప్రభుత్వ జీవో ప్రకారం వేతనాలివ్వాలని కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మూడేళ్లుగా మొరపెట్టుకుంటూనే ఉన్నారు. తర్వాత కమిటీలు వేశారు తప్ప తుది నిర్ణయం తీసుకోలేదు. కిందటి నెల.. జీతాల పెంపు అంశాన్ని వీసీ బయటకు తీశారు. సీనియర్‌ ఆచార్యులతో ఓ కమిటీని నియమించి... ఆ కమిటీ నివేదిక ఆధారంగా సర్కారు జీవో ప్రకారం వేతనాలను పెంచాలని ఈ నెల 22న ఉత్తర్వులు ఇచ్చారు. సాధారణంగా ఆర్థికపరమైన నిర్ణయాలను పదవీకాలం ముగిసే చివరి మూడు నెలల్లో ఉపకులపతులు తీసుకోరు. అందుకు భిన్నంగా వీసీ కట్టా వ్యవహరించడం చర్చకు దారితీసింది. అలాగే వీసీ తన పదవీకాలం ముగిసే రెండు రోజుల ముందు బదిలీలకు తెరతీశారు. జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు, సిరిసిల్లకు పలువురిని బదిలీ చేశారు. సందట్లో సడేమియా అన్నట్లు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఏడుగురు అకడమిక్‌ అసిస్టెంట్లను కూడా సహాయ ఆచార్యులు (కాంట్రాక్ట్‌)గా మార్చుతున్నట్లు సమాచారం. జేఎన్‌టీయూహెచ్‌ ఉన్నతాధికారులు మాత్రం మిగిలిన వర్సిటీలు ఎప్పుడో కొత్త వేతనాలను అమలు చేశాయని, ఈ వర్సిటీలోనే ఆలస్యమైందని చెబుతున్నారు. అకడమిక్‌ అసిస్టెంట్లు పాఠాలు బోధించకున్నా వారు ఆర్‌అండ్‌డీ, జే హబ్, అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ తదితర విభాగాల్లో విద్యాపరమైన పనులు చేస్తున్నారని, ఎంటెక్‌ తదితర విద్యార్హతలు ఉన్నవారేనని పేర్కొంటున్నారు. ఇక వర్సిటీలో నిర్మించిన పలు భవనాలను కూడా ఆయన ప్రారంభించడం విమర్శలకు దారితీసింది. దీనిపై జేఎన్‌టీయూహెచ్‌ ఇన్‌ఛార్జి వీసీ బుర్రా వెంకటేశాన్ని ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు