విజిలెన్స్‌ నివేదికలపై చర్యలేవీ?

తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై సమగ్ర విశ్లేషణలతో విజిలెన్స్‌ విభాగం ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నా.. వారిపై తీసుకుంటున్న చర్యలు అరకొరగానే ఉంటున్నాయి.

Published : 24 May 2024 03:24 IST

అవినీతి అధికారుల్లో  ఏ కోశానా భయం లేదు! 
సీఎంకు ఫిర్యాదుచేసిన  ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ 
సహ చట్టం ద్వారా సేకరించిన  గత పదేళ్ల నివేదికలు అందజేత 

ఈనాడు, హైదరాబాద్‌: తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై సమగ్ర విశ్లేషణలతో విజిలెన్స్‌ విభాగం ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నా.. వారిపై తీసుకుంటున్న చర్యలు అరకొరగానే ఉంటున్నాయి. నివేదికలు పంపించడం వరకే విజిలెన్స్‌ బాధ్యత కాగా.. ఆ విచారణ దస్త్రాలను పక్కనపడేయడం లేదా సంబంధిత శాఖాధిపతులకు పంపించేయడంతో తమపని అయిపోయిందన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో.. గత పదేళ్లలో జరిగిన విజిలెన్స్‌ విచారణల నివేదికలను సమాచార హక్కు చట్టం ద్వారా ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సేకరించింది. సంస్థ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ఆయా నివేదికలను అందజేశారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏ కోశానా లేదని, దీంతో సామాన్యుడు బలవుతున్నాడని ఆవేదన వెలిబుచ్చారు. ఉద్యోగస్తులు విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారని, హెచ్‌ఎండీఏ వంటి కొన్ని కార్యాలయాల్లో భూమి విలువను బట్టి లంచం ఉంటుందని సీఎంకు ఉదహరించారు. ఈ నేపథ్యంలో గత పదేళ్ల విజిలెన్స్‌ నివేదికలను విశ్లేషించి, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సచివాలయంలో ఇన్నాళ్ల పాటు విజిలెన్స్‌ నివేదికలను తొక్కిపెట్టిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.  

వ్యవస్థల పనితీరు మెరుగుదలను సూచిస్తూ విజిలెన్స్‌ విభాగం 123 రిపోర్టులు ప్రభుత్వానికి ఇచ్చింది. ఇందులో అత్యధికం వ్యవసాయ శాఖపై (20) ఇవ్వగా.. ఆ తర్వాత పురపాలక శాఖపై (17) ఇచ్చింది.

తీవ్ర అవినీతిపై 1230 నివేదికలు

2014 నుంచి 2024 మార్చి 31 మధ్య తీవ్ర అవినీతి కేసులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ దర్యాప్తు నిర్వహించి 1,230 నివేదికలను ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో అత్యధిక అవినీతి కేసులు ఎదుర్కొన్న వాటిల్లో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ (284) ముందుంది. రెవెన్యూ (174), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (142), వ్యవసాయ, సహకార (110), నీటిపారుదల (73), పౌరసరఫరాలు (64), పర్యావరణ, అటవీ (61), వైద్య ఆరోగ్యశాఖ (47) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.

భారీ అవకతవకలపై 768..

భారీ అవకతవకలను విశ్లేషించి విజిలెన్స్‌ విభాగం 768 నివేదికలను ప్రభుత్వానికిచ్చింది. ఇందులో పురపాలక శాఖలో 143 నివేదికలుండగా.. పౌరసరఫరాల శాఖలో 122, పంచాయతీరాజ్‌లో 80, నీటిపారుదల శాఖలో 59, వ్యవసాయంలో 52 ఉన్నాయి.

1,215 అప్రమత్తత నివేదికలు 

అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకోబోతున్నారంటూ గత పదేళ్లలో 1,215 అప్రమత్తత నివేదికలను విజిలెన్స్‌ విభాగం ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో అధిక నివేదికలతో (232) రెవెన్యూ శాఖ ముందువరుసలో ఉండగా.. పురపాలక శాఖ (189), కార్మిక, ఉపాధి శాఖలు (183) ఆ తర్వాత వరుసల్లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు