సంక్షిప్త వార్తలు (11)

తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో ఒప్పంద నియామకాలకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. శాశ్వత నియామకాలకు బదులు తమకు అనుకూలమైన వారిని ఉద్యోగాలు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 24 May 2024 05:15 IST

పశువైద్య వర్సిటీలో ఒప్పంద నియామకాలు 
అధికారుల ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో ఒప్పంద నియామకాలకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. శాశ్వత నియామకాలకు బదులు తమకు అనుకూలమైన వారిని ఉద్యోగాలు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ఉన్నతాధికారి తన కుమారుడికి బ్యాక్‌లాగ్‌ పోస్టులో నియమించేందుకు ప్రయత్నాలు చేయగా అది విఫలం కావడంతో ఒప్పంద నియామకాలకు పూనుకున్నట్లు తెలిసింది. ఈ విషయం బయటికి రావడంతో ఉన్నతాధికారులను కలిసి పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. తమకు అనుకూలమైన నేతలతోనూ ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాగా వర్సిటీ పాలకమండలి సమావేశం గురువారం జరగాల్సి ఉండగా.. వాయిదా పడింది. 


ఎస్సీ గురుకులాల్లో ఇంటర్‌కు దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని నాన్‌ సీవోఈ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి జూనియర్‌ ఇంటర్‌లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి కె.సీతాలక్ష్మి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 31 వరకు గురుకుల సొసైటీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, వొకేషన్‌ కోర్సుల్లో సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తు రుసుము కింద ఆన్‌లైన్లో రూ.100 చెల్లించాలని కోరారు.


చర్లపల్లి, సనత్‌నగర్‌ రైల్వేస్టేషన్ల తనిఖీ 

ఈనాడు, హైదరాబాద్‌: ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌ హైదరాబాద్‌లోని చర్లపల్లి, సనత్‌నగర్‌ రైల్వేస్టేషన్లను గురువారం తనిఖీ చేశారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న చర్లపల్లి టెర్మినల్‌ పనుల పురోగతిని తెలుసుకున్నారు. చర్లపల్లి నుంచి మౌలాలి, అమ్ముగూడ, సనత్‌నగర్‌ వరకు రైల్లో ప్రయాణిస్తూ విండో ఇన్‌స్పెక్షన్‌ చేశారు. సనత్‌నగర్‌ స్టేషన్‌లో అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.


భారీ ‘మీనం’ 

న్యూస్‌టుడే, కొత్తకోట గ్రామీణం: వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మహ్మద్‌హుస్సేన్‌పల్లి ఊర చెరువులో గురువారం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. మూడు అడుగుల పొడవు, 20 కిలోల బరువు ఉందని మత్స్యకారుడు శివ తెలిపారు. 


చిక్కుడు సెంచరీ.. బీన్స్‌ డబుల్‌ సెంచరీ!

ఈనాడు, హైదరాబాద్‌-అమీర్‌పేట, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో కూరగాయల ధరలు కుతకుతలాడుతున్నాయి. బీన్స్‌ ధర వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. గురువారం బహిరంగ మార్కెట్లలో కిలో బీన్స్‌ ధర రూ.220 నుంచి రూ.270 వరకు పలికింది. మరోవైపు గురువారం చిక్కుడు కాయ కిలో ధర రూ.110 దాటింది. అకాల వర్షాలు, ఎండలతో దిగుబడి తగ్గిపోవడమే కూరగాయల ధరలు పెరగడానికి కారణమని ఎర్రగడ్డ రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారి రమేష్‌ తెలిపారు.


పరిశ్రమలకు ప్రోత్సాహక బకాయిలు రూ.3,736 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాల బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ బకాయిలు ఈ నెల 20వ తేదీ నాటికి రూ.3,736.67 కోట్లు ఉన్నాయి. వీటిలో రూ.3007 కోట్లు చిన్న, మధ్య పరిశ్రమలకు, రూ.728 కోట్లు భారీ, మెగా పరిశ్రమలకు సంబంధించినవి. గత ఏడాది (2023-24) అప్పటి ప్రభుత్వం పరిశ్రమల రాయితీలు, ప్రోత్సాహకాలకు నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు పరిశ్రమలశాఖ వర్గాలు తెలిపాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని పరిశ్రమలకు ప్రభుత్వం ఇచ్చిన రూ.684.04 కోట్ల విలువైన చెక్కులు కూడా మురిగిపోయాయి. 


రైల్వే సీనియర్‌ డీసీఎంగా బాలాజీ కిరణ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: ద.మ.రైల్వే జోన్‌ ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్‌కు సీనియర్‌ డివిజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (డీసీఎం)గా వై.బాలాజీ కిరణ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో గుంతకల్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజినల్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ (డీఓఎం)గా పనిచేశారు.


ఎడ్‌సెట్‌కు 29,463 మంది హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన ఎడ్‌సెట్‌కు 87 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 33,879 మందికిగాను 29,463 మంది పరీక్షలు రాసినట్లు కన్వీనర్‌ ఆచార్య మృణాళిని తెలిపారు.


నేటి నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్టియర్‌కు 2,73,407 మంది, సెకండియర్‌కు 1,53,608 మంది హాజరుకానున్నారు. మొత్తం 926 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధాన పరీక్షలు ఈ నెల 31తో ముగుస్తాయి.


26న రవ్వా శ్రీహరి జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం

ఈనాడు, హైదరాబాద్‌: ఆచార్య రవ్వా శ్రీహరి జీవన సాఫల్య పురస్కారాలకు ఆచార్య శలాక రఘునాథశర్మ, డాక్టర్‌ నలిమెల భాస్కర్‌ ఎంపికయ్యారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సంస్కృత ఆచార్యుడిగా రఘునాథశర్మ, నలిమెల భాస్కర్‌ కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పదవీ విరమణ పొందారు. రవ్వా శ్రీహరి సంస్కృతాంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ నెల 26న ఉదయం 11 గంటలకు పురస్కారాలను అందజేస్తారు.


వానాకాలం సీజన్‌పై రైతులకు అవగాహన సమావేశాలు 

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలం పంటసాగు సన్నద్ధతలో భాగంగా రైతులతో గ్రామాల వారీగా అవగాహన సమావేశాలు నిర్వహించాలని వ్యవసాయశాఖ సంచాలకుడు బి.గోపి అధికారులను ఆదేశించారు. రైతులకు సరిపడా, నాణ్యమైన విత్తనాల సరఫరాకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని సూచించారు. గురువారం ఆయన జిల్లా అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ సీజన్‌ ఆశాజనకంగా ఉందని, విత్తనాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ గుర్తింపు పొందిన డీలర్ల దగ్గరే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. విత్తనాలకు సంబంధించి బిల్లును భద్రపరుచుకోవాలని సూచించారు. విత్తన డీలర్ల దుకాణాలను సందర్శించి విత్తనాల నిల్వలపై ఎప్పటికప్పుడు నివేదికలను పంపించాలన్నారు. జిల్లాలో రోజువారీగా టాస్క్‌ఫోర్స్‌ బృందాల సమావేశం నిర్వహించాలన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని