గతంలో కంటే వేగంగా ధాన్యం కొనుగోళ్లు

రైతులకు వెన్నుదన్నుగా పౌరసరఫరాల శాఖ ఉందని.. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరుపై వారు సంతోషంగా ఉన్నారని, తాను స్వయంగా వెళ్లి కొనుగోలు కేంద్రాల్లో చాలామందిని కలిశానని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ అన్నారు.

Published : 24 May 2024 04:17 IST

ఎమ్మెల్యే ఏలేటి ఆరోపణలు అబద్ధం 
43 మంది బకాయిదారులపై కేసులు 
పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ చౌహాన్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: రైతులకు వెన్నుదన్నుగా పౌరసరఫరాల శాఖ ఉందని.. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరుపై వారు సంతోషంగా ఉన్నారని, తాను స్వయంగా వెళ్లి కొనుగోలు కేంద్రాల్లో చాలామందిని కలిశానని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ అన్నారు. గతంలో కంటే ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లు వేగంగా, పారదర్శకంగా జరుగుతున్నాయని.. అయినప్పటికీ కొందరు నేతలు చేస్తున్న ఆరోపణలు ఆవేదన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రైతులకు నష్టం చేసేలా ఎవరైనా వ్యవహరించినా, ఆధారాల్లేని ఆరోపణలు చేసినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గురువారమిక్కడ పౌరసరఫరాల శాఖ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మే 22 నాటికి రాష్ట్రవ్యాప్తంగా రూ.8,690 కోట్ల విలువైన 39.51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయన్నారు. 83 శాతం మంది రైతులకు ధాన్యం డబ్బులిచ్చామని చెప్పారు. మూడ్రోజుల్లోనే వారి ఖాతాల్లో సొమ్ములు జమవుతున్నాయన్నారు. ఎమ్మెల్యే, భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన ఆరోపణల్ని విలేకరులు ప్రస్తావించగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణలు వంద శాతం అబద్ధమన్నారు. ‘‘25 ఏళ్లుగా తెలంగాణలో పనిచేస్తున్నా. నేనేంటో అందరికీ తెలుసు. గతంలో ధాన్యం దందాలు జరిగాయి. ప్రస్తుతం పనితీరు ఆధారంగా, శాస్త్రీయంగా మిల్లర్లకు ధాన్యం కేటాయిస్తున్నాం. బకాయిలున్న వారికి ధాన్యమివ్వట్లేదు. మిల్లర్ల నుంచి రూ.668 కోట్ల బకాయిలు వసూలుచేశాం. 43 మంది బకాయిదారులపై కేసులు నమోదు చేశాం. మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయిలు రూ.1,438 కోట్లు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు తీస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ప్రభుత్వ నిర్ణయం మేరకు తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. తడిసిన ధాన్యంలో సీఎంఆర్‌ చేయగలిగే ధాన్యాన్ని బాయిల్డ్‌ కోటా కింద మిల్లర్లకు ఇస్తాం. మిల్లింగ్‌ చేయలేనిది, మొలకెత్తిన వాటిని వేలం వేసి అమ్ముతాం. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ జిల్లా అధికారిని సస్పెండ్‌ చేశాం. ఇద్దరిని ఉద్యోగం నుంచి తొలగించాం’’ అని చౌహాన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని