పచ్చిరొట్ట విత్తనాలకు డిమాండ్‌

పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జీలుగ, పిల్లి పెసరలకు రాష్ట్రంలో డిమాండ్‌ ఏర్పడింది. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించే జీవ ఎరువులుగా ఉపయోగపడే వీటిపై రైతుల్లో చైతన్యం పెరగడంతో వానాకాలం సీజన్‌లో కొనుగోళ్లకు రైతులు పెద్దఎత్తున ముందుకొస్తున్నారు.

Published : 24 May 2024 04:18 IST

 కొనుగోలుకు బారులు తీరిన రైతులు 

ఈనాడు,హైదరాబాద్‌: పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జీలుగ, పిల్లి పెసరలకు రాష్ట్రంలో డిమాండ్‌ ఏర్పడింది. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించే జీవ ఎరువులుగా ఉపయోగపడే వీటిపై రైతుల్లో చైతన్యం పెరగడంతో వానాకాలం సీజన్‌లో కొనుగోళ్లకు రైతులు పెద్దఎత్తున ముందుకొస్తున్నారు. ప్రభుత్వ నిల్వల కంటే అదనంగా విక్రయాలు జరపాలని ఒత్తిడి వస్తోంది. పచ్చిరొట్ట ఎరువుల కోసం నిర్దేశించిన మొక్కలను పొలంలోనే పెంచి, పూతదశలో పొలంలో కలియదున్నడం వల్ల అవి కుళ్లి... నేలలో అత్యధిక పరిమాణాల్లో పోషకాలు పోగుపడతాయి. రేగడి మట్టి, పశువుల పేడకంటే పచ్చిరొట్ట పది రెట్లు ఎక్కువగా భూములను సారవంతం చేస్తుందని రైతులు విశ్వసిస్తున్నారు. 

60 శాతం సబ్సిడీతో...

నేల సారాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లుగా 60 శాతం సబ్సిడీపై ఈ విత్తనాలను అందజేస్తోంది. గతేడాది 1.70 లక్షల క్వింటాళ్ల మేరకు పంపిణీ జరగగా... ఈ వానాకాలంలో 1.95 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై విక్రయించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. దీని కోసం నిర్వహించిన టెండర్లలో హరియాణాకు చెందిన సంస్థ సరఫరా కాంట్రాక్టును దక్కించుకుంది. ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలు.. అవి లేని చోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రాష్ట్ర ప్రభుత్వం విక్రయాలను ప్రారంభించింది. ఇప్పటికే జీలుగ 1.20 లక్షల క్వింటాళ్లు, జనుము 20 వేల క్వింటాళ్లు, పిల్లిపెసర వెయ్యి క్వింటాళ్ల విత్తనాలు రాష్ట్రానికి రాగా వాటిలో గురువారం వరకు 13,859 క్వింటాళ్లు విక్రయించారు. ఇందులో 12,249 క్వింటాళ్ల జీలుగ, 1,610 క్వింటాళ్ల జనుము విక్రయాలు జరిగాయి. జీలుగ 30 కిలోల బస్తా రూ.2,790 కాగా రూ.1,674 సబ్సిడీ పోను రూ.1,116ని రైతులు చెల్లిస్తున్నారు. జనుము 40 కిలోల బస్తా రూ.3,620 ధర కాగా రూ.2,172 రాయితీ ఇస్తున్నారు. రూ.1,448కే రైతుకు వస్తోంది. పిల్లి పెసర 20 కిలోల బస్తా ధర రూ.2,710 కాగా సబ్సిడీ పోను రూ.1,084కి విక్రయిస్తున్నారు. వాటి కొనుగోలుకు పెద్ద సంఖ్యలో రైతులు ముందుకు రావడంతో కొనుగోళ్లు సజావుగా సాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని