పశువైద్యం.. ఖాళీలతో సతమతం!

తెలంగాణ పశువైద్య శాఖలో, పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో ఖాళీల సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. పలు కళాశాలల్లో పోస్టులు భర్తీ కాక.. 2024-25 విద్యాసంవత్సరానికి  ప్రవేశాలపై సందిగ్ధం నెలకొంది.

Published : 24 May 2024 05:08 IST

వర్సిటీ, పలు కళాశాలల్లో సిబ్బంది కొరత 
ప్రవేశాలపైనా సందిగ్ధం   
నెలాఖరుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవీవిరమణ   
వీసీ బాధ్యతలూ ఆయన చేతిలోనే 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పశువైద్య శాఖలో, పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో ఖాళీల సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. పలు కళాశాలల్లో పోస్టులు భర్తీ కాక.. 2024-25 విద్యాసంవత్సరానికి  ప్రవేశాలపై సందిగ్ధం నెలకొంది. పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అథర్‌సిన్హా వచ్చే నెల 13వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పశువైద్య విశ్వవిద్యాలయం వీసీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన పదవీ విరమణతో వీసీ పోస్టు కూడా ఖాళీ అవుతుంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో ఈ పోస్టు భర్తీకి ఎలాంటి చర్యలూ ప్రారంభంకాలేదు.

పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో రాజేంద్రనగర్, కోరుట్ల, మామునూరు, సిద్దిపేటల్లో పశువైద్య కళాశాలలున్నాయి. వీటిల్లో బోధన, బోధనేతర పోస్టులు భారీఎత్తున ఖాళీగా ఉన్నాయి. 2022 జనవరిలో జాతీయ పశువైద్యమండలి (వీసీఐ) బృందం మామునూరు కళాశాలను తనిఖీ చేసి మౌలిక వసతులు, బోధన సిబ్బంది కొరతను గుర్తించి, మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులను తీసుకోవద్దని ఆదేశించింది. బోధన సిబ్బంది వచ్చే వరకు 3, 4 సంవత్సరాల తరగతులు నిర్వహించొద్దని ఆదేశించింది. దీంతో నాలుగో సంవత్సరం విద్యార్థులను ఆ ఏడాది రాజేంద్రనగర్, కోరుట్ల కళాశాలల్లో సర్దుబాటు చేశారు. 2023-24 విద్యాసంవత్సరానికి ఈ కళాశాలలో అధికారులు ప్రవేశాలు కల్పించినా.. ఖాళీల కారణంగా బోధన సరిగా జరగడం లేదు. బోధన సిబ్బంది కొరతతో సిద్దిపేటలో ప్రవేశాలు కల్పించలేదు. కోరుట్ల, రాజేంద్రనగర్‌లోనూ పలు విభాగాల్లో ఖాళీలున్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వం గత జూన్‌లో 105 మంది బోధన సిబ్బంది నియామకాలకు అనుమతించింది. ఇందులో మామునూరు కళాశాలలో 11 అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 14 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సిద్దిపేటలో ఒక డీన్, 18 మంది ప్రొఫెసర్లు, 17 మంది అసోసియేట్, 44 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులున్నాయి. అయితే ఎంపిక అనంతరం వివాదంతో గత నాలుగు నెలలుగా ఈ నియామకాలు నిలిచిపోయాయి. 

కొడంగల్‌కు కళాశాల మంజూరైనా..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో  పశువైద్యకళాశాల ఏర్పాటుకు ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయించింది. రూ.360 కోట్లు మంజూరు చేసింది. కళాశాలకు 50 ఎకరాల భూమితో పాటు 18 మంది ప్రొఫెసర్లు, 18 మంది సహ     ఆచార్యులు, 44 మంది సహాయ ఆచార్యులు, మరో 125 మంది పొరుగు సేవల సిబ్బంది పోస్టులను మంజూరు చేసింది. వీటి నియామకాల ప్రక్రియ సైతం ప్రారంభంకాలేదు. దీంతో కొత్త విద్యాసంవత్సరంలో ఈ కళాశాల ప్రారంభమయ్యే సూచనలు కనిపించడంలేదు. 

ప్రధాన కార్యాలయంలోనూ..

పశువైద్యశాఖ సంచాలకురాలు మంజువాణి ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్నారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీగా ఆమె పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పదవీ విరమణ అనంతరం ఈ రెండు పోస్టులు ఖాళీ కానున్నాయి. వీటి భర్తీకి కిందిస్థాయి అధికారులకు పదోన్నతులు కల్పించాలి. ఇందుకోసం శాఖాపరమైన పదోన్నతుల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా ఇప్పటివరకు జరగలేదు. 

సీఎం పరిధిలో ఉన్నా..

పశువైద్యశాఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దే ఉంది. శాఖాపరంగా, విశ్వవిద్యాలయంలో సమస్యలు వెల్లువెత్తుతున్నా.. ఉన్నతాధికారులు వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికే ఒకసారి సీఎం సమీక్ష జరిపినా.. ఖాళీల వంటి కీలక అంశంపై చర్చ జరగలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని