సంక్షిప్త వార్తలు (3)

ప్రజారోగ్య సంరక్షణే లక్ష్యంగా నకిలీ, నాసిరకం మందుల కట్టడికి రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) కృషి చేస్తోందని ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated : 25 May 2024 05:41 IST

నకిలీ, నాసిరకం మందుల కట్టడికి చర్యలు: డీసీఏ డీజీ 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజారోగ్య సంరక్షణే లక్ష్యంగా నకిలీ, నాసిరకం మందుల కట్టడికి రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) కృషి చేస్తోందని ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డీసీఏలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విజిలెన్స్‌ సెల్‌ ద్వారా నకిలీ డ్రగ్‌ రాకెట్లను ఛేదించి రూ.5.41 కోట్ల విలువైన మందులు స్వాధీనం చేసుకున్నామన్నారు. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు నాలుగు నెలల్లో 50 నాసిరకం మందులను గుర్తించామన్నారు. ఎక్సైజ్‌ శాఖతో కలసి రూ.11.32 కోట్ల విలువైన 3-ఎంఎంసీ, అల్ఫా-పీహెచ్‌పీ మత్తు పదార్థాల నిల్వలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మూడు లైసెన్స్‌ లేని మందుల తయారీ యూనిట్ల నుంచి రూ.1.36 కోట్ల మందులు సీజ్‌ చేశామన్నారు. మందులను అధికధరలకు విక్రయిస్తున్న ఘటనలపై 40 కేసులు, తప్పుదారి పట్టించే ప్రకటనలపై 46 కేసులు, లైసెన్స్‌ లేని మెడికల్‌ షాపులపై 26 కేసులు, లైసెన్స్‌ లేని నిల్వ, నకిలీ వైద్యులకు సంబంధించి 53 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


ఎన్‌సీసీ కోటా పునరుద్ధరించాలి
సీఎంకు తెలంగాణ రెడ్డి సంఘం వినతి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు ఒక శాతం ఎన్‌సీసీ రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలని తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరింది. సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపు జైపాల్‌రెడ్డి, నల్ల సంజీవరెడ్డి, కన్వీనర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి శుక్రవారం సీఎంను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్‌సీసీ రిజర్వేషన్‌ అమల్లో ఉండగా... తెలంగాణలో అమలు కావడం లేదని తెలిపారు. రాష్ట్రంలోని ఇంజినీరింగు, వ్యవసాయ, పాలిటెక్నిక్‌ తదితర అన్ని కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్‌సీసీ రిజర్వేషన్‌ ఉందని, దానిని ఎంబీబీఎస్‌కు వర్తింప జేయాలని కోరారు.


 ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత నిర్ణయం ఉపసంహరణ

ఈనాడు, అమరావతి: ఆరోగ్యశ్రీ కింద రోగులకు సేవల నిలిపివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల ఆసోసియేషన్‌(ఆశా) కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. సీఎస్‌ జవహర్‌రెడ్డితో శుక్రవారం జరిగిన చర్చల్లో మరో రూ.300 కోట్ల విడుదలకు హామీ లభించిందని తెలిపింది. అనుబంధ ఆసుపత్రుల వారు యథావిధిగా రోగులకు సేవలు కొనసాగిస్తున్నారని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ లక్ష్మీశా వెల్లడించారు. 22న 6,718 మంది, 23న 7,118 మంది చొప్పున ఆరోగ్యశ్రీ కింద రోగులు చికిత్స పొందారని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు