టీఎస్‌ఎండీసీ నుంచి ఆరుగురు ఉన్నతాధికారులు వెనక్కి

తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ)లో కీలక మార్పులు జరుగుతున్నాయి. గనులశాఖ కార్యదర్శి, టీఎస్‌ఎండీసీ వీసీ, ఎండీగా ఉన్న మహేశ్‌దత్‌ ఎక్కాను ఆ బాధ్యతల నుంచి ఈ నెల 17 న బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరికొందరిని తప్పించింది.

Published : 25 May 2024 03:30 IST

ముగ్గురు జీఎంలు, ముగ్గురు పీవోలు 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ)లో కీలక మార్పులు జరుగుతున్నాయి. గనులశాఖ కార్యదర్శి, టీఎస్‌ఎండీసీ వీసీ, ఎండీగా ఉన్న మహేశ్‌దత్‌ ఎక్కాను ఆ బాధ్యతల నుంచి ఈ నెల 17 న బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరికొందరిని తప్పించింది. టీఎస్‌ఎండీసీలో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న ఆడిట్, పంచాయతీరాజ్‌ శాఖలకు చెందిన అధికారుల్ని వెనక్కి పంపుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వీరిలో ముగ్గురు టీఎస్‌ండీసీలో కీలకమైన జనరల్‌ మేనేజర్లు కాగా, మరో ముగ్గురు ప్రాజెక్టు అధికారులు ఉన్నారు. డిప్యుటేషన్‌ రద్దయ్యి వెనక్కి వెళ్లిన జీఎంలలో పాండు రంగారావు, దేవేందర్‌రెడ్డి, ప్రశాంతి.. పీవోల్లో శ్రీనివాసులు, దశరథ్, శ్రీధర్‌ ఉన్నారు. 2023-24కు సంబంధించి ఇసుక ఆదాయం రూ.1,355 కోట్ల లక్ష్యానికి గాను టీఎస్‌ఎండీసీ రూ.673.55 కోట్లే సాధించింది. 2022-23లో వచ్చిన ఆదాయం రూ.757.32 కోట్లతో పోల్చినా తక్కువే. తక్కువ ఆదాయం రావడంతో టీఎస్‌ఎండీసీ పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వరుసగా ఉన్నతాధికారుల మార్పులు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని