కన్నెపల్లి పంపుహౌస్‌కు నీటి మళ్లింపుపై దృష్టి

మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల నేపథ్యంలో గోదావరి వరదను కన్నెపల్లి పంపుహౌస్‌కు మళ్లించే మార్గాలపై నీటిపారుదల శాఖ దృష్టిసారించింది.

Published : 25 May 2024 03:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల నేపథ్యంలో గోదావరి వరదను కన్నెపల్లి పంపుహౌస్‌కు మళ్లించే మార్గాలపై నీటిపారుదల శాఖ దృష్టిసారించింది. దీనిపై శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డ్‌ ఆఫ్‌ చీఫ్‌ ఇంజినీర్ల (బీవోసీఈ) సమావేశంలో చర్చించింది. నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌తోపాటు పలువురు ఇంజినీర్లు ఈ సమావేశంలో పాల్గొని ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు. కన్నెపల్లి పంపుహౌస్‌ సమీపంలో నదిలో తాత్కాలికంగా ఆనకట్ట కట్టడం ద్వారా నీటి మళ్లింపునకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జియో టెక్స్‌టైల్‌ ట్యూబ్‌ (జియో ట్యూబ్‌) టెక్నాలజీ గురించి సీఈలకు ఒక సంస్థ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించింది. దీని ద్వారా ఒనగూరే లాభాలు, వ్యయం, సమస్యలపై నీటిపారుదల శాఖ త్వరలో ప్రభుత్వానికి నివేదికను సమర్పించే అవకాశాలున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ జరిగే వరకు నీటి నిల్వ కష్టంగా మారింది. బ్యారేజీకి ఎగువన దాదాపు 17 కిలోమీటర్ల వద్ద ఉన్న కన్నెపల్లి పంపుహౌస్‌కు నీటిని మళ్లించి ఎగువకు ఎత్తిపోయాలని నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. 

ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే నీటిపారుదల శాఖలో బదిలీలు చేపట్టేందుకు కార్యాచరణ చేపడుతున్నారు. సుదీర్ఘకాలం నుంచి ఒకేచోట పనిచేస్తున్న వారికి స్థానచలనం కల్పించనున్నట్లు సమాచారం. దీంతోపాటు కొత్తగా ఎంపికైన దాదాపు 850 మంది ఏఈ, ఏఈఈలను శాఖలోకి తీసుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు