కబ్జా చెరలో దేవుడి మాన్యాలు

ఆక్రమణదారుల చెరలో ఉన్న దేవుడి మాన్యాలకు  రక్షణ కల్పించే క్రమంలో దేవాదాయ శాఖ ట్రైబ్యునల్‌ను మరింత పటిష్ఠం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Published : 25 May 2024 03:35 IST

ఏకంగా 19 వేల ఎకరాలపై వ్యాజ్యాలు
కేసులను వేగంగా తేల్చడంపై ప్రభుత్వం దృష్టి
దేవాదాయ ట్రైబ్యునల్‌ బలోపేతానికి కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: ఆక్రమణదారుల చెరలో ఉన్న దేవుడి మాన్యాలకు  రక్షణ కల్పించే క్రమంలో దేవాదాయ శాఖ ట్రైబ్యునల్‌ను మరింత పటిష్ఠం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ట్రైబ్యునల్‌కు నూతన ఛైర్మన్‌తోపాటు మరో సభ్యుడిని నియమించాలని నిర్ణయించింది. ఎన్నికల కోడ్‌ ముగిశాక తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం ట్రైబ్యునల్‌లో ఛైర్మన్‌ పదవీ విరమణ చేయడంతో ఇన్‌ఛార్జి ఛైర్మన్, మరో సభ్యుడు ఉన్నారు. ఏదైనా కేసు విషయంలో ఇరువురూ భిన్నాభిప్రాయాలతో తీర్పు ఇస్తే... ఆ వ్యవహారం ప్రభుత్వం వద్దకు చేరుతోంది. అక్కడ చిక్కుముడి వీడేందుకు మరికొంత సమయం పడుతోంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయంపైనా హైకోర్టు గడప తొక్కే పరిస్థితి వస్తోంది. ఈ నేపథ్యంలో సభ్యుల సంఖ్యను రెండుకు పెంచాలని దేవాదాయ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. ట్రైబ్యునల్‌లో ముగ్గురు ఉంటే... మెజారిటీ సభ్యుల ఆమోదంతో తీర్పులు వెలువడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, దేవాదాయ శాఖ చట్టాన్ని సవరిస్తేనే మరో సభ్యుడిని నియమించేందుకు అవకాశముంటుంది. ప్రస్తుతం జిల్లా జడ్జి స్థాయి అధికారి ఛైర్మన్‌గా, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ స్థాయి అధికారి సభ్యుడిగా ఉన్నారు. ట్రైబ్యునల్‌కు వచ్చే కేసులన్నీ భూములకు సంబంధించినవే కావడంతో రెవెన్యూ శాఖతో సంబంధమున్న అధికారిని మరో సభ్యుడిగా నియమిస్తే ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో వివిధ కేసుల్లో ఛైర్మన్, సభ్యుడు వేర్వేరు తీర్పులు ఇచ్చినప్పుడు... అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. ఆ కేసులన్నింట్లోనూ సభ్యుడి తీర్పునే అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. దాంతో అప్పట్లోనే అదనపు సభ్యుడిని నియమించాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 

ట్రైబ్యునల్‌లో 715 కేసుల పెండింగు 

సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు వరకు, దేవాదాయ ట్రైబ్యునల్‌లో కలిపి 19 వేల ఎకరాలపై వ్యాజ్యాలు పెండింగులో ఉన్నాయి. భూముల విస్తీర్ణంపై స్పష్టత లేకపోయినప్పటికీ 715 కేసుల వరకు ట్రైబ్యునల్‌లో పెండింగులో ఉన్నాయి. అత్యధికంగా 259 కేసులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉన్నాయి. ఉమ్మడి హైదరాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 80 చొప్పున పెండింగు ఉన్నాయి. మెదక్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని