ఒకవైపు ఎండ.. మరోవైపు వానలు

రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని చోట్ల జోరు వానలు కురిశాయి.

Published : 25 May 2024 04:54 IST

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో 45.6 డిగ్రీలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాల్లో 6 సెం.మీ. వర్షం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని చోట్ల జోరు వానలు కురిశాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తేమంతా అటు వైపు వెళ్లిపోతుండడంతో ఎండ తీవ్రత పెరుగుతోంది. అదే సమయంలో క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది,. 

శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఈ జిల్లాలోని చండ్రుగొండ, ముల్కలపల్లి, బూర్గంపాడులలో 6 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని కొంత ప్రాంతానికి విస్తరించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారి 26వ తేదీ అర్ధరాత్రికి పశ్చిమ బెంగాల్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో తీరం దాటుతుందని వాతావరణశాఖ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని