నకిలీ విత్తనాల నష్టానికి తక్షణ పరిహారం!

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి తెలిపారు.

Updated : 25 May 2024 05:27 IST

విత్తన చట్టంలో మార్పులకు శాసనసభలో బిల్లు
వ్యవసాయ సంచాలకుడు గోపి 
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తనమేళా ప్రారంభం

విత్తనమేళాను ప్రారంభిస్తున్న వ్యవసాయ సంచాలకుడు గోపి, విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు రఘురామిరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి తెలిపారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయినప్పుడు తక్షణ పరిహారం అందించేందుకు వీలుగా విత్తన చట్టంలో సవరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన విత్తన మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. ‘వానాకాలం సీజన్‌లో రైతుల డిమాండ్‌కు అనుగుణంగా ఆయా రకాల విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నాం. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. మిగిలినవి కూడా అవసరమైన మేరకు లభ్యమవుతాయి. ఎరువులు కూడా పుష్కలంగా ఉంటాయి’ అని చెప్పారు. నాణ్యమైన, తెగుళ్లను తట్టుకోగలిగే అనేక రకాల విత్తనాలను విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చిందని, వాటిని వినియోగించుకోవాలని పరిశోధన సంచాలకుడు రఘురామిరెడ్డి రైతులకు సూచించారు. ఈ సందర్భంగా రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. వివిధ పంటలపై విశ్వవిద్యాలయం రూపొందించిన కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకురాలు సుధారాణి, విత్తన పరిశోధన సాంకేతిక సంస్థ సంచాలకుడు జగన్మోహన్‌రావు, విత్తన ధ్రువీకరణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేశవులు, విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. 

73.50 లక్షల విత్తనాల విక్రయం

మేళాలో ప్రదర్శనకు పెట్టిన విత్తనాల కొనుగోలుకు భారీగా స్పందన లభించింది. వరి ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా వంటి స్టాళ్ల వద్దకు రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. తగినన్ని నిల్వలు లేక.. చాలామందికి అవి అందలేదు. దీనిపై రైతులు వాగ్వాదానికి దిగడంతో కొంత గందరగోళం ఏర్పడింది  రాష్ట్రవ్యాప్తంగా అన్ని పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల్లో విత్తనాలను అందుబాటులో ఉంచామని.. రైతులు ఆందోళన చెందవద్దని పరిశోధన సంచాలకుడు రఘురామిరెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. విత్తన మేళాకు 2800 మంది రైతులు హాజరయ్యారని అన్నిరకాలు కలిపి 73.5 లక్షల విలువైన విత్తనాలను విక్రయించామని తెలిపారు. అన్నిటి కంటే ఎక్కువగా తెలంగాణ సోనా 482 క్వింటాళ్లను తాము విక్రయించగా... విత్తనాభివృద్ధి సంస్థ వారు మరో  50 క్వింటాళ్లను విక్రయించారని తెలిపారు. బీపీటీ 240 క్వింటాళ్లు,  దొడ్డు రకాలైన ఎంటీయూ 140, ఆర్‌ఎన్‌ఆర్‌  28361 రకం 200 క్వింటాళ్ల విక్రయం జరిగిందన్నారు. ఆర్‌ఎన్‌ఆర్‌ 28361 మరో అయిదు వేల క్వింటాళ్లు విత్తనాభివృద్ధి సంస్థ వద్ద అందుబాటులో ఉన్నాయని రఘురామిరెడ్డి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని