చేనేత, ఇతర సంఘాలకు త్వరలో ఎన్నికలు!

రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలతోపాటు పదవీ కాలం ముగిసిన ఇతర సంఘాలకు ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర చేనేత, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలకు అనుగుణంగా ఈ శాఖల అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.

Published : 26 May 2024 03:28 IST

సహకార శాఖ సన్నాహాలు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలతోపాటు పదవీ కాలం ముగిసిన ఇతర సంఘాలకు ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర చేనేత, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలకు అనుగుణంగా ఈ శాఖల అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. రాష్ట్రంలో వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు మినహా ఇతర సంఘాలకు ఎన్నికలు సజావుగా జరగడం లేదు. పాలకవర్గాల స్థానంలో పర్సన్‌-ఇన్‌ఛార్జిలను నియమించి వాటిని నడిపిస్తున్నారు. చేనేత, సహకారశాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించినప్పుడు దీర్ఘకాలికంగా సంఘాలకు ఎన్నికలు జరగని విషయం గుర్తించారు. చేనేత, సిల్క్‌ సహకార సంఘాలకు 2013 ఫిబ్రవరిలో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. పాల ఉత్పత్తిదారుల సంఘాలు, మత్స్య, గీత కార్మిక సంఘాలు, గొర్రెల పెంపకందారులు ఇతర సంఘాలకు ఎన్నికలు చాలా ఏళ్లుగా నిర్వహించడం లేదు. వీటన్నింటిని పరిశీలించిన మంత్రి పదవీకాలం ముగిసిన ప్రతి సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.

సంఘాలు, ఓటర్ల సమాచార సేకరణ 

దీనికి అనుగుణంగా కార్యాచరణ ప్రారంభమైంది. రాష్ట్రంలో 253 చేనేత, 135 పాల ఉత్పత్తిదారుల, 3717 మత్స్య సహకార, 3602 గీత కార్మిక, 26 సిల్క్‌ సంఘాలుండగా.. ఇతరత్రా కలిపి మొత్తం 20,998 సంఘాలున్నాయి. వీటి ఎన్నికలు సహకార శాఖ ద్వారా జరుగుతాయి. దీనికి సంబంధించి చేనేత, మత్స్య, పశుసంవర్ధక, ఆబ్కారీ ఇతర శాఖల నుంచి ఇప్పటికే సమాచారం కోరింది. ముందుగా ఆయా ప్రభుత్వ శాఖలు తమ పరిధిలోని సంఘాలు, వాటి సభ్యుల జాబితాలను ఫొటోలతో రూపొందించాలి. పరిశీలన అనంతరం ఎన్నికల అధికారులను నియమిస్తారు. శాఖలు, జిల్లాల వారీగా ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా సభ్యులుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు