తవ్విన ఖ‘నిజమెంత?’

గనుల తవ్వకాల్లో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో పలుచోట్ల నిబంధనలకు విరుద్ధంగా గనుల నిర్వహణ ఉందని... ప్రభుత్వానికి రాయల్టీ చెల్లింపుల్లో తీవ్ర అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణలున్నాయి.

Published : 26 May 2024 03:34 IST

మైనింగ్‌లో అక్రమాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: గనుల తవ్వకాల్లో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో పలుచోట్ల నిబంధనలకు విరుద్ధంగా గనుల నిర్వహణ ఉందని... ప్రభుత్వానికి రాయల్టీ చెల్లింపుల్లో తీవ్ర అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లీజుకు ఇచ్చిన ప్రతి గనిలో తవ్విన ఖనిజాల లెక్కల్ని పక్కాగా తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. దీంతో గనులశాఖ అధికారులు క్షేత్రస్థాయి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. దీని కోసం అధికారులు ప్రస్తుతం డీజీపీఎస్, ఈటీఎస్‌ సర్వే అనే ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్నారు. 

భారీగా లీజులు...

రాష్ట్రంలో ప్రధాన ఖనిజాలకు సంబంధించిన లీజులు 122 ఉన్నాయి. వీటిలో ఎక్కువ ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో ఉన్నాయి. చిన్న ఖనిజాల మైనింగ్‌కు ఇచ్చిన లీజుల సంఖ్య 2,559. రోడ్‌ మెటల్, గ్రానైట్, గ్రావెల్, డోలమైట్, క్వార్ట్జ్, లైమ్‌స్టోన్‌ వంటి ఖనిజ లీజులు ఉన్నాయి. వీటిపై వార్షిక డెడ్‌ రెంట్, పర్మిట్‌ ఫీజుతో పాటు తవ్వితీసిన ఖనిజం పరిమాణాన్ని బట్టి రాయల్టీ విధిస్తారు. మైనింగ్‌ అక్రమాలకు పాల్పడినవారిలో కొందరు ఒకచోట అనుమతి తీసుకుని మరోచోట తవ్వకాలు సాగించారు. మరికొందరు అనుమతి పొందిన ప్రాంతం హద్దులు దాటి మైనింగ్‌ చేశారు. ఇంకొందరు సరైన ప్రాంతంలోనే ఖనిజాలను తవ్వితీసినా లెక్కలు తక్కువ చూపించారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీలో భారీగా కోతపడింది ఈ అక్రమాలను బయటపెట్టేందుకు సర్వే కోసం గనులశాఖ కొన్ని ఏజెన్సీలను ఎంపికచేసింది. తొలుత డీజీపీఎస్‌ (డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌) సర్వే... ఆ తర్వాత ఈటీఎస్‌ (ఎలక్ట్రానిక్‌ టోటల్‌ స్టేషన్‌) సర్వే నిర్వహిస్తారు. డీజీపీఎస్‌ విధానంలో లీజుదారుడు అనుమతి పొందిన భూమిలోనే మైనింగ్‌ చేశాడా లేదా అన్నది స్పష్టమవుతుంది. ఈటీఎస్‌ సర్వేలో లీజు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని టన్నుల ఖనిజాలను తవ్వారన్నది తెలిసిపోతుంది. ఏజెన్సీల నివేదిక వచ్చాక ఉల్లంఘనులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని