బీడీ కార్మికులకు వేతన పెంపు

రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, ప్యాకర్ల వేతన పెంపుపై కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాలకు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి.

Published : 26 May 2024 03:35 IST

కార్మిక సంఘాలు, యాజమాన్యాలకు కుదిరిన ఒప్పందం

మాట్లాడుతున్న యాజమాన్యాల ప్రతినిధులు రమణ్‌భాయ్‌ పటేల్, రశ్మీకాంత్‌ పటేల్, హితేంద్ర ఉపాధ్యాయ, ధర్మేంద్ర గాంధీ, ప్రభాకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, ప్యాకర్ల వేతన పెంపుపై కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాలకు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న దాదాపు 7 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. కొత్తగా చేసిన వేతన పెంపు 2024 మే 1 నుంచి రెండేళ్ల పాటు అమల్లో ఉండేలా శనివారం హైదరాబాద్‌లో ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ తెలంగాణ రాష్ట్రకమిటీ అధ్యక్షుడు వనమాల కృష్ణ తెలిపారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీచుట్టే కార్మికులు, నెలవారీ వేతన ఉద్యోగులు, బీడీ ప్యాకర్లతో గతంలో చేసుకున్న వేతన ఒప్పందం 2024 ఏప్రిల్‌ 30తో ముగిసింది. కొత్త వేతనాల అమలు కోసం కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాలు చర్చలు జరిగాయి. బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో దాదాపు 95శాతానికిపైగా బీడీలు చుట్టేవారు ఉంటారు. ప్రస్తుతం వెయ్యిబీడీలు చుడితే వారికి రూ.245.08 అందుతోంది. తాజాగా జరిగిన చర్చల్లో అదనంగా రూ.4.25 పెంచేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. పెరిగిన మొత్తానికి పండగ, సెలవులు, బోనస్‌ అన్నీ కలిపితే ప్రతి వెయ్యి బీడీలకు వేతనం రూ.249.99కి చేరుతోంది. బీడీ ప్యాకర్లు ప్రస్తుతం పొందుతున్న వేతనాలపై నెలకు అదనంగా రూ.3,650 ఇవ్వనుంది. అలాగే నెలవారీ వేతన ఉద్యోగులైన బట్టీవాలా, బీడీసార్టర్లు, చెన్నీవాలా తదితరులకు ప్రస్తుత నెలవారీ వేతనాలపై అదనంగా రూ.1,700 పెంచేలా నిర్ణయం తీసుకున్నాయి. ఈ నూతన వేతన ఒప్పందం 2026 ఏప్రిల్‌ 30 వరకు అమల్లో ఉంటుంది. ఈ చర్చల్లో బీడీ యజమానుల సంఘం తరఫున తెలంగాణ బీడీ మ్యానుఫ్యాక్చరర్స్‌ అధ్యక్షులు హితేంద్ర ఉపాధ్యాయ, ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర గాంధీ, దేసాయి బీడీ ప్రొడక్షన్‌ మేనేజర్‌ రశ్మీకాంత్‌ పటేల్, ప్రభుదాస్‌ కిషోర్‌దాస్‌ టొబాకో ప్రొడెక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ మేనేజర్‌ రమణ్‌భాయ్‌ పటేల్, చార్‌బాయి బీడీ హెచ్‌ఆర్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని